Ticker

6/recent/ticker-posts

Ad Code

పెళ్లి వేడుకలో ఘోరం.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సహా 100 మంది సజీవదహనం


బాగ్దాద్‌ సెప్టెంబర్‌ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఇరాక్‌లో పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. సర్వాంగసుందరంగా ముస్తాబై ఉన్న ఫంక్షన్‌ హాల్‌లో పిల్లలు, పెద్దల సమక్షంలో సంబురంగా వివాహ వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మంటలు ఆ ఫంక్షన్‌ హాల్‌ అంతటా వ్యాపించాయి. అప్పటిదాకా పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఫంక్షన్‌ హాల్‌.. కాసేపట్లోనే హాహాకారాలు, ఆర్తనాదాలతో మార్మోగింది. శవాల దిబ్బగా మారింది.ఇరాక్‌ దేశంలోని మోసుల్‌ నగర శివార్లలోగల అల్‌`హమ్దానియాలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సహా 100 మంది సజీవదహనమయ్యారు. మరో 150 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.అంతకుముందు ఫంక్షన్‌ హాల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫైర్‌ సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్‌లతో సాయంతో ఎట్టకేలకు మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు.పెళ్లి వేడుక సందర్భంగా ఫంక్షన్‌ హాల్‌లో పటాసులు కాల్చడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నదని పోలీసులు ప్రాథమింగా అంచనాకు వచ్చారు. ఫంక్షన్‌ హాల్‌ లోపలి వైపు పూర్తిగా చెక్క మెటీరియల్‌తో డెకరేట్‌ చేశారని, పటాసుల నిప్పు రవ్వలు ఎగిరి ఫర్నీచర్‌కు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని వారు భావిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు