హైదరాబాద్, ఆగస్టు 5, (ఇయ్యాల తెలంగాణ) : తెలుగు సినిమాలకు అచ్చమైన తెలుగు టైటిల్ ఉంటే ఆ అందమే వేరుగా ఉంటుంది. అప్పట్లో సినిమా నేపథ్యాన్ని తగ్గట్టుగా మంచి తెలుగు పేరునే టైటిల్ గా పెట్టేవారు. ఆధునిక పోకడల వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాక, నేటి తరాన్ని ఆకర్షించే ఇంగ్లీష్, హిందీ పదాలను పేర్లుగా పెట్టారు. రాను రాను ఇంగ్లీష్ ` తెలుగు కలబోసిన ‘టింగ్లిష్’ టైటిల్స్ ను పెట్టడం మొదలెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ చిత్రసీమలో మునుపటి తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి. చాలా వరకు మన దర్శక నిర్మాతలు స్వచ్ఛమైన తెలుగు పేర్లను పెడుతూ భాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. కాకపోతే పాన్ ఇండియా సినిమాలకు వచ్చే సరికి యూనివర్సల్ అప్పీల్ కోసం ఎక్కువగా ఇంగ్లీష్ పేర్లను ఆశ్రయిస్తున్నారు. ఇది కూడా కొంత వరకు ఓకే కానీ, ఇతర భాషల చిత్రాల తెలుగు వెర్షన్ కు పెట్టే టైటిల్స్ తోనే ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు తమిళ, కన్నడ, హిందీ మలయాళ భాషల నుంచి తెలుగులోకి ఏ సినిమా వచ్చినా.. ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోడానికి వారి అభిరుచికి తగ్గట్లుగా అచ్చ తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేసేవారు. కానీ ‘పాన్ ఇండియా’ ట్రెండ్ మొదలైన తర్వాత భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకే టైటిల్ తో మార్కెట్ చేసుకోవాలనుకొని, ఆయా భాషల సినిమాల్ని నేరుగా అదే పేరుతో తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవి ఏమాత్రం సెట్ అవ్వడం లేదు. అజిత్ కుమార్ నటించిన ‘వలిమై’ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేశారు. ముందుగా ఆ చిత్రానికి తెలుగులో ‘బలం’ అనే పేరు పెట్టారు. కానీ అంతలోనే దాన్ని తీసేసి ‘వలిమై’ పేరుతోనే విడుదల చేశారు. ఇప్పటికీ చాలామంది తెలుగువాళ్లకు వలిమై అంటే ఏంటో తెలీదు. ‘తునివు’ సినిమాను కూడా అదే టైటిల్ తో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏమనుకున్నారో ఏమో, చివరి నిమిషంలో ‘తెగింపు’ అనే టైటిల్ చేశారు. అలానే సూర్య నటించిన ‘ఎతర్కుమ్ తునిందవన్’ (ఇు) మూవీని.. తెలుగుతో పాటుగా మిగతా అన్ని భాషల్లో ‘ఈటి’ అనే పేరుతో విడుదల చేసారు.
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కూడా అంతే. మొదటి భాగాన్ని ‘ఖూ 1’ పేరుతో, రెండో పార్ట్ ని ‘ఖూ 2’ టైటిల్ తో రిలీజ్ చేసారు. నిజానికి ఏమాత్రం అర్ధం తెలియని వలిమై, ఈటి, పీఎస్`1, పీఎస్`2 లాంటి పేర్లు తెలుగు జనాలకు రిజిస్టర్ అవ్వలేదు. అవి తమిళ సినిమాలే అనే భావన పడిపోయింది. అందుకే థియేటర్లకు వెళ్లాలనే ఆసక్తి కలగలేదు. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్టుగా ‘వూల్ఫ్’ (చినీశ్రీట) అనే వింత టైటిల్ తో మరో సినిమా రాబోతోంది. ప్రభుదేవా, అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలనే ప్లాన్ తో అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టారు. తెలుగులోకి వచ్చే సరికి అది కాస్తా ‘వుల్ఫ’ (ఙశ్రీటజీ) అయింది. అనువాదంలో జరిగిన తప్పిదం కారణంగా సోషల్ విూడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తప్పు గ్రహించిన మేకర్స్ ఆ తర్వాత ‘వుల్ఫ్’ అనే టైటిల్ తో పోస్టర్ వదిలారు. చివరకు టీజర్ రిలీజ్ అయ్యే సమయానికి ఫైనల్ గా అది ‘వూల్ఫ్’ గా మారింది. తెలుగు టైటిల్స్ విషయంలో మేకర్స్ డేడికేషన్ ఎలా ఉందో పైన చెప్పుకున్న సినిమాల పేర్లు చూస్తే అర్థం అవుతుంది. కనీసం తెలుగు తెలిసిన వ్యక్తిని కూడా సంప్రదించకుండా టైటిల్స్ పెడుతున్నారేమో అనే సందేహం కలుగుతోంది. అందుకే ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమా వస్తుందంటే టాలీవుడ్ ప్రేక్షకులు హడలిపోతున్నారు. ఈసారి ఎలాంటి వింత టైటిల్ వినాల్సి వస్తుందోనని భయపడే పరిస్థితి ఏర్పడిరది. తెలుగు టైటిల్స్ విషయంలో ఒకాడికి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ నయం అనుకోవాలి. మన వాళ్లకు తగ్గట్టుగా పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనా ఇతర భాషల చిత్రాల్ని తెలుగులోకి అనువాదం చేస్తున్న నిర్మాతలు.. మన నేటివిటీకి తగ్గట్లుగా పేర్లు పెట్టకపోవడంపై భాషాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాడుక భాషలో ఉన్న ఇంగ్లీష్ టైటిల్స్, నామవాచకాలు అయితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు.. కానీ క్రియానామాలను కూడా అలాగే ఉంచడాన్ని విమర్శిస్తున్నారు. కొందరు కనీసం తెలుగు ఫాంట్ లో పోస్టర్స్ కూడా రిలీజ్ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచైనా టాలీవుడ్ లోకి తీసుకొచ్చే డబ్బింగ్ చిత్రాలకు అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టాలని, తెలుగు ట్రాన్స్ లేషన్ లో ఎలాంటి దోషాలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలుగు భాషా ప్రియులు కోరుతున్నారు.