తిరుపతి, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ );తిరుమల నడకమార్గంలో భక్తులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. కోవిడ్ సమయంలో చిరుతల సంతతి గణనీయంగా పెరిగింది. తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 40కు పైగానే చిరుతలు సంఖ్య ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. చిరుతలతో పాటుగా, ఎలుగుబంటుల సంచారం టీటీడీని కలవర పాటుకు గురి చేస్తుంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ సవిూపంలో రెండు రోజుల క్రితం ఓ ఏలుగుబంటికి మత్తు మందు ఇచ్చి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దట్టమైన చెట్లతో నిండిన శేషాచల అటవీ ప్రాంతం ఎన్నో వన్యప్రాణులు, వన్యమృగాలకు ఆవాస స్థలం. నడక మార్గంలో భక్తులు వాటితో ఫోటోలు దిగేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలో వాటి కోసం చిరుతలు వస్తున్నట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో నీటి కొరత ఉండడంతో వన్యమృగాలు దాహార్తిని తీర్చుకునేందుకు నుంచి బయటకు వస్తున్నట్లు అటవీ శాఖ నిపుణులు చెబుతున్నారు. నడక మార్గాలకు దూరంగా అటవీ ప్రాంతంలో చెక్ డ్యాంలను ఏర్పాటు చేయడం ద్వారా వన్యమృగాలు అక్కడే ఉండే సంచరించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు తిరుమల కాలినడక మార్గాల్లో భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నడక మార్గాల్లో వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. నడక మార్గం పరిసర ప్రాంతాల్లో చిరుత, ఎలుగు బంటి తిరుగుతున్నాయని భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మెట్ల మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపారు. వరుసగా వన్య ప్రాణుల దాడులతో నడక మార్గంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. పట్టుకున్న రెండు చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుతను డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా గుర్తించాల్సి ఉందని తెలిపారు. కంచె ఏర్పాటుపై భారత వన్య సంరక్షణ విభాగం అనుమతుల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జంతువుల సంపర్కం సమయం.. అందువల్ల చిరుతల కదలికలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ అవ్వడం వల్ల చిరుతల సంచారం పెరిగిందని వస్తున్న ఆరోపణలను నాగేశ్వరరావు ఖండిరచారు.మోకాళ్ల మెట్టు, నరసింహస్వామి ఆలయం ఆవరణలో ట్రంక్ లైజింగ్ ఎక్వింప్మెంట్ సిద్ధంగా పెట్టుకున్నామని, మెట్ల మార్గంలో వంద మంది గ్రూప్‌లుగా వెళ్లాలని కోరారు ఏడోవ మైలు వద్ద ఒక చిరుత, ఎలుగు బంటి మాత్రమే ఉన్నట్టు కెమెరా ట్రాప్ ద్వారా తెలుస్తోందని, వైల్డ్ లైఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం కంచె ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని, మహారాష్ట్ర నుంచి కొన్ని బోనులు తీసుకు వచ్చి వాటిని కొన్ని రీమోడల్ చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల నడక మార్గాల్లో అటవీ జంతువుల సంచారం పెరిగింది. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కొన్నిసార్లు భక్తులపై దాడి చేశాయి. గత జూన్ 22న ఆదోనికి చెందిన కౌషిక్ చిరుత దాడిలో గాయపడ్డాడు. తాజాగా ఆగస్టు 12న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించి ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని నియమించింది. తిరుమలలో ఆపరేషన్ చిరుతను టీటీడీ అటవీశాఖ అధికారులు కొనసాగిస్తూనే ఉన్నారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారంతో పాటుగా, ఎలుగుబంటి, అడవికుక్కల కదలికలను గుర్తించారు. అంతేకాకుండా తిరుమల లోని స్పెషల్ టైపు కాటేజ్ వద్ద ఏలుగుబంటి కదలికలు ట్రాప్ కెమెరాలలో రికార్డు కావడంతో అప్రమత్తమైన అధికారులు స్థానికులను అప్రమత్తం చేయడంతో పాటుగా, ఆ ప్రదేశంలో ట్రాప్ కేజెస్‌ను ఏర్పాటు చేశారు. అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలను గుర్తించిన ప్రదేశాల్లో దాదాపు పది ట్రాప్ కేజెస్‌ను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.