హైదరాబాద్, ఆగస్టు 11, (ఇయ్యాల తెలంగాణ) : వైపు ప్రజాకర్షక హావిూలపై కసరత్తు చేస్తూనే తెలంగాణ రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల ఎంపికపై నజర్ పెట్టాయి. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితాలను విడుదల చేయాలని తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలు రెడీ అవుతున్నారు. ఇందుకు పార్టీలో అంతర్గతంగా బేరీజు వేసుకునే ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రైవేటు సర్వేలను నమ్ముకుంటున్నారు. వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల జాబితాను సిద్దం చేస్తున్న ప్రధాన పార్టీలు వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల కమిటీలను నియమించుకున్న పార్టీలు.. ఆ కమిటీల ద్వారా నియోజకవర్గాల వారీగా ప్రజాకర్షణ వున్న నాయకుల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. అయితే, తాము సిద్దం చేసుకుంటున్న జాబితాలపై నిర్ణయం తీసుకునే క్రమంలో సొంత నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజల్లో వారి విూద ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు పార్టీలు ప్రైవేటు సర్వే సంస్థలను నమ్ముకుంటున్నాయి. గత దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సుపరిచితమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ`ప్యాక్ సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. పీకే ఐ`ప్యాక్ సంస్థతోపాటు మరిన్ని సర్వే సంస్థలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.ముందుగా చెప్పుకోవాలంటే అధికార భారత రాష్ట్ర సమితి గురించి చెప్పుకోవాలి. అధికారంలో వున్నందున ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా రిపోర్టులు తీసుకోవడం సహజమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే పలు మార్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇంకోవైపు ఐ`ప్యాక్ సంస్థతో కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇంటెల్ నివేదికలతోపాటు ఐ`ప్యాక్ సర్వే రిపోర్టును పోల్చుకుంటూ సిట్టింగు ఎమ్మెల్యేలకే మళ్ళీ అవకాశమివ్వాలా లేక కొత్త వారిని ఎంపిక చేసుకోవాలా అన్నది తేల్చబోతున్నారు కేసీఆర్. మూడు నెలల క్రితం ఐ`ప్యాక్ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లోను, పార్టీ శ్రేణుల్లోను అసంతృప్తి వుందన్న అంశాన్ని గ్రహించిన కేసీఆర్.. వారి నడవడికను మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. మార్చకుని ప్రజలకు సన్నిహితం కాకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లుండవని కూడా ప్రకటించారు. నిజానికి దాదాపు ఏడాది క్రితం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చే క్రమంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సిట్టింగులందరికీ మళ్ళీ టిక్కెట్ ఇస్తానంటూ కీలక ప్రకటన చేశారాయన. దాంతో వందకుపైగా వున్న అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా తమకు టికెట్ ఖాయమని తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. మూడు, నాలుగు నెలల క్రితం సుమారు 40 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెగెటివ్ టాక్ వుందంటూ ఐ`ప్యాక్ సంస్థ సర్వే రిపోర్టును కేసీఆర్‌కు అందజేసింది. దాంతో వారికే మళ్ళీ టికెట్ ఇస్తే పార్టీ పుట్టి మునుగుతుందన్న భావన కేసీఆర్‌లో మొదలైంది. దాంతో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారిని పిలిపించుకుని తాను స్వయంగా కొందరికీ, తన తనయుడు కేటీఆర్ ద్వారా మరి కొందరికి ప్రవర్తన మార్చుకోవాలని హితోపదేశం చేశారు. ఈక్రమంలో గెలుపు గుర్రాల తొలి జాబితాను 2018 లాగే చాలా ముందుగా ప్రకటించాలని భావిస్తున్న కేసీఆర్.. పాజిటివ్ రిపోర్టు వుండి, తప్పకుండా గెలుస్తారన్న సిట్టింగులకు తిరిగి టికెట్లిస్తూ మొదటి లిస్టును విడుదల చేయాలని తలపెట్టినట్లు తెలుస్తోంది. ఓ కథనం ప్రకారం 80 మందితో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఆగస్టు చివరి వారంలోగానీ, సెప్టెంబర్ తొలివారంలోగానీ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.ఇక ఇటీవల దూకుడు పెంచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు.
ఏకంగా 26 మందితో జంబో ఎన్నికల కమిటీని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కీలక నేతలందరికీ ఇందులో చోటు కల్పించారు. ఈ ఎన్నికల కమిటీ ఇపుడు నియోజకవర్గాల వారీగా టికెట్లను ఆశిస్తున్న నాయకుల జాబితాను రెడీ చేస్తోంది. ఇందులో ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిన వారితో తొలి జాబితా విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత మల్లు భట్టి విక్రమార్క, కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, వి.హనుమంతరావు తదితరులు సమ్మతించిన నేపథ్యంలో తొలి జాబితాపై రాష్ట్ర ఎన్నికల కమిటీ ఎక్సర్‌సైజ్ చేస్తోంది. ఇదిలా వుండగా కర్నాటక ఫార్ములాతో తెలంగాణాలోను పాగా వేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక వధేరాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు చెరో సర్వే సంస్థ ద్వారా తెలంగాణలో టికెట్ ఆశావహులపై సర్వే చేయిస్తున్నారు. వీరిద్దరి సర్వేలతోపాటు టీపీసీసీ ఎన్నికల కమిటీ చేస్తున్న కసరత్తులో ఏకాభిప్రాయం కుదిరిన వారితో అభ్యర్థుల తొలి లిస్టు విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కనీసం 40 మందితో తొలి జాబితాలను ఆగస్టు నెలాఖరులో విడుదల చేయాలని మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక రెండు, మూడు నెలలుగా కాస్త స్తబ్ధుగా కనిపించిన భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో గేరు మార్చింది. బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీ.బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ ఛైర్మెన్ ఈటల రాజేందర్‌లతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ సమావేశమవుతున్నారు. ఇదివరకే తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్‌లను ఇంఛార్జిలుగా నియమించుకున్న బీజేపీ.. తాజాగా ఎన్నికల ప్రిపరేషన్‌ను అన్ని విధాలా కోఆర్డినేట్ చేసేందుకు సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్‌ను కూడా తెలంగాణకు పంపింది. ప్రకాశ్ జవదేకర్ గతంలో సుదీర్ఘ కాలం తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించారు. తెలంగాణపై కూడా ఆయనకు పూర్తి పట్టుంది. ఉద్యమకాలంలో ఆయన తెలంగాణ బీజేపీ ఇంఛార్జిగా వున్నారు.
ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రకాశ్ జవదేకర్‌ని డిప్యూట్ చేసింది బీజేపీ హైకమాండ్. దానికి తోడు అభ్యర్థుల జాబితా ప్రిపరేషన్ బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో అయిదుగురు కీలక నేతలకు ఇచ్చిందని కూడా ప్రచారం జరుగుతోంది. ముందుగా ఈ అయిదుగురు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన వారితో తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జి.కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, డి.కే.అరుణ, డా.కే.లక్ష్మణ్‌ల బృందం మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు తొలి జాబితా రానున్నది. ఇక సంఫ్‌ు పరివార్ తరపున రాష్ట్రంలో గ్రౌండ్ పరిస్థితిని అంచనా వేసేందుకు సుమారు 500 మంది రెండు నెలల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా కింది స్థాయిలో పర్యటించినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వీరంతా సంఫ్‌ు పరివార్‌లోని వివిధ సంస్థల్లో పూర్తి సమయ కార్యకర్తలని, వారిచ్చే నివేదిక ఖరాఖండిగా వుంటుందని కూడా పార్టీవర్గాలంటున్నాయి. వీరిచ్చిన రిపోర్టుల ఆధారంగా ప్రకాశ్ జవదేకర్ డైరెక్షన్‌లో అభ్యర్థుల ఎంపిక జరుగుతందంటున్నారు. వీలైనంత త్వరగా తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది.
0 కామెంట్‌లు