జగిత్యాల ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ):జిల్లా లోని బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త (కోర్టు) లో సెప్టెంబర్ 6న విచారణ జరుగనుంది. జిల్లా ఉన్నతాధికారులు 32 పేజీలతో కూడిన 18 షీట్ల నివేదికను లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేశారు. అట్టి నివేదిక ను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలుపాలని పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి కి లోకాయుక్త రిజిస్ట్రార్ సూచించారు.బుగ్గారం గ్రామ పంచాయతీ లో నిధుల దుర్వినియోగం జరిగిందని అదే గ్రామస్థుడు చుక్క గంగారెడ్డి గత మూడు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.స్థానిక, జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కు కూడా గతంలో ఆయన పిర్యాదులు చేశారు. కానీ సరైన పద్ధతిలో చట్టబద్దంగా విచారణ జరుగకపోవడం, నిధుల దుర్వినియోగాన్ని కూడా అధికారులు కప్పి పుచ్చడం జరిగిందని చుక్క గంగారెడ్డి అనేక సార్లు ఆరోపించారు. ఆయా అధికారులపై కూడా జిల్లా కలెక్టర్ కు ఆయన పిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారులు కూడా సమగ్ర విచారణ చేపట్టక పోవడం, నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వలన బుగ్గారం గ్రామస్థులు, కుల సంఘాల వారు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ అయిన చుక్క గంగారెడ్డి 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త ను ఆశ్రయించాడు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులపై ఆయన లోకాయుక్త రిజిస్ట్రార్ కు పిర్యాదు చేయడం జరిగింది. చుక్క గంగారెడ్డి పిర్యాదు ను స్వీకరించిన లోకాయుక్త రిజిస్ట్రార్ జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసి సరైన నివేదిక అందజేయాలని ఆదేశించారు.లోకాయుక్త ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు గత జూన్ 21న 18 షీట్ల తో కూడిన 32 పేజీల నివేదికను లోకాయుక్త కు అందజేశారు. అందులో కూడా అనేక దాపరింపులు, అక్రమాలు, న్యాయస్థానాలను కూడా తప్పుద్రోవ పట్టించే చేష్టలు జరిగినట్లు తెలుస్తోంది. దుర్వినియోగం అయిన నిధుల సొమ్ము లక్షల్లో రికవరీ చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులుఅట్టి నివేదికలో పేర్కొన్నారు. కానీ...లక్షలాది రూపాయలు రికవరీ చేసి కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్యం, అవకతవకలు, అధికారుల పనితీరుపై బుగ్గారం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్‌లు