హైందవేతరులకు రిజర్వుడు స్థానాలు కేటాయిస్తే -
మతమార్పిడిని ప్రోత్సహించినట్టే..!
మతం మారిన వారికి సీట్లు కేటాయిస్తే..
నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేసినట్టే..! - విశ్వ హిందూ పరిషత్
హైదరాబాద్,
మతం మారిన వారికి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు. హిందూ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, హిందూ విశ్వాసా లను విడిచిపెట్టిన వారు ఎస్సీ, ఎస్టీ కోటాలో లభించే రిజర్వేషన్లు కూడా కోల్పోతారని రాజ్యాంగం తెలియజేస్తుంది. దీని ఆధారంగా ఆయా పార్టీలు వాస్తవమైనటువంటి దళితులు, గిరిజనులకే రిజర్వుడు స్థానాలు కేటాయించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని విస్మరించి రిజర్వుడు స్థానాల్లో హిందువేతరులకు అవకాశం కల్పిస్తే..మతమార్పిడి మహమ్మరిని ప్రోత్సహించి న్యాయమైన ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినట్లేనని వారు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ సూత్రాలను పాటించాలని వారు బుధవారం ఓ పత్రిక ప్రకటన ద్వారా వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రంలో 20 ఎస్సీ,12 ఎస్టీ మొత్తం 32 స్థానాలు రిజర్వేషన్ కోటాలో ఉన్నాయి. వాటి స్థానంలో నిజమైన హిందువులకే సీట్లు కేటాయించాలని.. మతం మారిన వారికి సీట్లు కేటాయిస్తే న్యాయ పోరాటం చేస్తామని, ఆయా నియోజకవర్గాల్లో హిందూ సమాజాన్ని చైతన్యం చేసి హిందూ ద్రోహులకు బుద్ధి చెబుతామని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు.మతం మారిన వారు వెంటనే రిజర్వేషన్లు కూడా వదులుకోవాలని వారు ఘాటుగా స్పందించారు. మతం మారిన వారు ఎస్సీ ఎస్టీ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంబడే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని విశ్వహిందూ పరిషత్ నేతలు తేల్చి చెప్పారు.