హైదరాబాద్, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసేందుకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ప్రజలు, అభిమానుల కోసం ప్రజాయుద్ధనౌక పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఉంచారు. ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చిన వారితో ఆ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోయింది. నీ పాట ఎప్పుడూ మాలో ఉత్సాహాన్ని ఉద్యమ కాకంక్షను రగిలిస్తూనే ఉంటుందని అంటున్నారు గద్దరక్ నివాళి అర్పించే ప్రముఖులు, అభిమానులు. ఎల్పీస్టేడియంలో ఉన్న గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన పాటలు, మాటలను గుర్తు చేసుకున్నారు. గద్దర లాంటి ఉద్యమకారులు, ప్రజాగాయకుడి మరణం రాష్ట్రానికే చాలా తీరని లోటని బాధని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశయాలు నెరవేరకుండానే ఆయన కాలం చెందారని బాధపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో చెప్పినట్టు కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాము ఊహించిన తెలంగాణ ఇంకా సాకారం కాలేదని అన్నారని తెలిపారు. మార్పు కోసం మరో ఉద్యమం రావాలని కోరుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చి గద్దర పార్థివ దేహానికి నివాళి అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని గుర్తు చేసుకున్నారు. రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనను కోరారని తెలిపారు. తెలంగాణ మంత్రులు కూడా గద్దర్ పార్ధివ దేహానికి నివాళి అర్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటుడు మోహన్ బాబు, హాస్యనటుడు అలీ, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ నివాళి అర్పించారు. అన్ని యూనివర్శిటీల నుంచి విద్యార్థులు తరలి వచ్చి అశ్రునివాళి అర్పిస్తున్నారు. గద్దర్ రాసిన పాటలను గుర్తుచేసుకుంటున్నారు.
అభిమానులు, ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఎల్పీస్టేడియంలోని గద్దర్ భౌతిక కాయాన్ని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకొచ్చి కాసేపు ఉంచుతారు. అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ విూదుగా ఆల్వాల్ కు గద్దర్ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆల్వాల్ లో గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రజాగాయకుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద కాసేపు భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అక్కడ అంతిమ లాంఛనాలు పూర్తి చేసి అక్కడి నుంచి శ్మశానవాటికకు తరలిస్తారు. ఈ టైంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియు నిర్వహించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం తప్పుబడుతోంది. ఇలా చేయడం అంటే పోలీసు అమరవీరులను అవమాన పరిచడమే అంటూ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన వారి త్యాగాలకు విలువ ఏముందని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ ప్రశ్నించారు. గద్దర్ అంతిమయాత్ర.. కట్టుదిట్టంగా పోలీసుల నిఘా..ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్రపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతిమయాత్రపై పోలీసులు నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ఇందుకోసం సీసీ కెమెరా మౌంటెడ్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో.. వేలాదిమందిగా అభిమానులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను పోలీసులు గమనిస్తున్నారు. గద్దర్‌తో ఉద్యమంలో కలిసి పనిచేసిన చాలామందిపై కేసులు నమోదై ఉన్నాయి. కొంతమంది జైలుకు వెళ్లి రాగా మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఆయనను కడసారి చూసేందుకు అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అంతిమయాత్రపై నిఘా పెట్టారు పోలీసులు. సుమారు 12 కిలోవిూటర్ల మేర సాగనున్న అంతిమయాత్ర సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను మౌంటెడ్ సీసీ కెమెరా వెహికల్ ద్వారా గమనిస్తున్నారు. ఇక మఫ్టీలో ఉన్న పోలీసులు సైతం గద్దర్ అంతిమయాత్ర సాధారణ జనంతో కలియ తిరుగుతూ.. నక్సలైట్లను లేదా సానుభూతిపరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.పాటలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించిన ప్రజా గాయకుడు గద్దర్.. గత నెల 20న గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు.
గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన డాక్టర్లు.. ఈనెల 3న సర్జరీ చేశారు. అంతకుముందు నుంచే మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా గద్దర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆదివారం రోజున తుదిశ్వాస విడిచారు. అయితే జూలై 31న హాస్పిటల్ నుంచి విూడియాకు స్వయంగా లేఖ రాశారాయన. సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని మాట ఇచ్చారు. కానీ అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. హార్ట్ సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకుని సాంస్కృతిక ఉద్యమం ప్రారంభించి.. ప్రజల రుణం తీర్చుకుంటానని భావించారు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.నక్సలైట్లు?చీకట్లో మగ్గుతున్న సమాజానికి టార్చిలైట్లు అంటూ జనంలోకి పాట రూపంలో దూసుకెళ్లారు. వెదురు పూల తోటలో పూసిన విప్లవ పాటకు వైతాళికుడుగా మారారు. ంఐ`47 తూటాల కంటే గద్దర్ పాటలే పవర్ఫుల్ అని పోలీస్ బాసులే ఆనాడు స్వయంగా చెప్పారు. ఏకే `47 కంటే డేంజర్ ఈ గద్దర్ అంటూ అప్పట్లో ఆయన కోసం తెలంగాణను జల్లెడ పట్టేవాళ్లు పోలీసులు. ఈ గాలిలో నేలలో ఉద్యమంలో జనం ఊపిరిలో ఉనికిలో పాటై వెలిగారు గద్దర్. ఎరుపెక్కిన కళ్లతో రేపటి సూర్యోదయాన్ని కలగన్నారు. గద్దర్ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్ మోగించేది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట, జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయి.తెలంగాణ సమాజానికి ఎంతగానో ఉపయోగప్రజా గాయకుడైన గద్దర్ హఠాన్మరణం చెందడం తీరని లోటు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన తెలంగాణ సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డారని గుర్తు చేశారు. గద్దర్ ఓ గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక అని అభివర్ణించారు.
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారని అన్నారు. కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గద్దర్ మరణించడం బాధాకరమని అన్నారు. అలాంటి వ్యక్తి అయిన గద్దర్ చనిపోతే, నిన్నటి నుంచి పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని సోమవారం (ఆగస్టు 7) మధ్యాహ్నం విూడియాతో మాట్లాడుతూ.. జి.కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. చిల్లర రాజకీయాలు చేయవద్దని.. ప్రభుత్వం అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహిస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొద్దిమంది అన్నీ తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని అన్నారు. లాల్ బహదూర్ స్టేడియం కూడా వాళ్లే ఏర్పాటు చేశారని చెప్పుకుంటున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. షన్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ లోకాన్ని విడిచిపోయారని అన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇబ్బందులు అలానే ఉన్నాయని గద్దర్ భావించేవారని చెప్పారు. అందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. గద్దర్ ఉహించిన తెలంగాణ రాలేదని చాలా బాధ పడ్డారని కిషన్ రెడ్డి అన్నారు. నిజానికి చాలా సందర్భాల్లో గద్దర్ సైతం ఈ విషయం గురించి మాట్లాడేవారని కిషన్ రెడ్డి అన్నారు.