స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి
న్యూఢిల్లీ, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలోని కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా సహా పలు కోటాలను కేంద్రం గతేడాది రద్దు చేసిన విషయం విదితమే. కేవీల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలపై కేంద్రం స్పందించింది. కేవీల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించే అవకాశం లేనేలేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. కాబట్టి వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా దేశ వ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా కేవీలను ప్రారంభించారు అని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతిస్తే తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే కేవీల్లో ఎంపీల కోటాను రద్దు చేశాం. ఎంపీ కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేది ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదని అన్నపూర్ణ దేవి స్పష్టం చేశారు.