అదిలాబాద్, ఆగస్టు 12, (
ఇయ్యాల తెలంగాణ) : సెలవులొస్తే ఏ విద్యార్థి అయినా ఎగిరి గంతేస్తాడు. హస్టల్లో చదివే విద్యార్థులైతే ఇంటికి వెళ్లేందుకు ఛాన్స్ దొరికిందంటూ.. ఫ్రెండ్స్‌తో కలసి షికారుకు వెళ్లొచ్చంటూ మురిసిపోతారు.. కానీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మాత్రం సెలవులెందుకు ఇచ్చారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కాలేజీకి వచ్చివారం కూడా పూర్తికాక ముందే ఇంటికి వెళ్లాలంటూ ఉన్నతాధికారులే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంచెం ఇష్టంగా ఇంకొంచం కష్టంగా ఇంటి దారి పట్టారు విద్యార్థులు. అయితే అలా వెళుతున్న విద్యార్థులంతా వారంలోగా రిఫ్రెష్ అయి కాలేజీలో క్యాంపస్ లైఫ్‌ను జాలీగా ఎంజాయ్ చేస్తూ.. ఉన్నత చదువులపై ఫోకస్ పెట్టేలా సిద్దం అయి వచ్చేందుకే ఈ హాలీడేస్ అంటోంది అక్కడి అధికార యంత్రాంగం. ఒక్క సారిగా స్వేచ్చ ప్రపంచం నుండి బందిఖానాలోకి వచ్చామనే ఫీలింగ్‌తో కాకుండా బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేసేందుకు అపూర్వ అవకాశం అని బావించి సిద్దమై రమ్మంటోంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పియుసి`1 విద్యార్థులకు కొత్త సెలవులు ప్రకటించారు. అవే హోమ్ సిక్ హాలీడేస్.. అంటే ఇంటి విూద బెంగ పెట్టుకున్నారు.. వెళ్లిరండి అని. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు రోజుల పాటు హాయిగా గడిపి రండి అని టాటా బైబై చెప్పింది ట్రిపుల్ ఐటీ. కారణం మూడు రోజుల క్రితం జాదవ్ బబ్లూ అనే పీయూసీ వన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం. ఆ విద్యార్థి మరణ వార్తతో ఆందోళనకు గురైన తోటీ స్నేహితులు ఎక్కడ చదువుపై ఫోకస్ పెట్టరో అన్న టెన్షన్‌లో హోమ్ సిక్ సెలవులను ప్రకటించింది ట్రిబుల్ ఐటీ యాజమాన్యం. ఉన్నపళంగా 14 వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి.. శుక్రవారం రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి విసి వెంకటరమణ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీ అయ్యారు.పదో తరగతి వరకు ఇంటి వద్ద ఉండి చదువుకున్న విద్యార్థులు 10 రోజుల క్రితమే ట్రిబుల్ ఐటీలోకి కొత్త బ్యాచ్‌గా ఎంట్రీ ఇవ్వగా.. అంతలోనే విషాద వార్త వినాల్సి రావడంతో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పల్లెటూరి వాతవరణం నుండి వచ్చిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలోని పెద్దపెద్ద భవనాలు, విశాలమైన ప్రాంగణంలో కొంత కొత్తగా, మరికొంత ఒత్తిడిగా గడిపారు. అలాగే గత వరుస ఆత్మహత్యల ఘటన నేపథ్యంలో ట్రిపుల్ ఐటి యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, విసి అధ్యాపకులు ఇతర సిబ్బందితో శుక్రవారం ప్రత్యేకంగా చర్చించారు. విద్యార్థులకు కాస్త రిలాక్స్ అవసరమని గుర్తించిన ట్రిపుల్ ఐటీ ఉన్నతాదికారుల హోమ్ సిక్ హాలీడేస్ రూపంలో విద్యార్థులను ఇంటికి పంపారు.విద్యార్థులు తిరిగి వచ్చేలోగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని.. ఈ ఏడాది నుండి ఒక కంప్లైంట్ బాక్స్‌ను ఉంచనున్నామని.. ఇందులో కంప్లైంట్ వేస్తే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి పరిష్కరిస్తామని చెపుతున్నారు. మరో వైపు అత్యంత ఫోకస్ చేయాల్సిన అంశంగా విద్యార్థుల ప్రవర్తన, మానసిక ఒత్తిడిని గుర్తించేందుకు ప్రతి విద్యార్థి మొబైల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్‌తో రూపొందించిన సేవ్ లైఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. ప్రతి శనివారం లోకల్ విద్యార్థులతో కలిసి వీసి విత్ విలేజ్ విజిట్.. ప్రతినెలలో ఒక కాలేజీ ఫెస్ట్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా ఉండేలా దృష్టి పెట్టనున్నారు.
0 కామెంట్‌లు