హైదరాబాద్, ఆగస్టు 11, (
ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందుతోంది. దీంతో గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారు. కాగా.. తాజాగా డెలివరీల సంఖ్య భారీగా రికార్డు స్థాయిలో పెరిగింది. జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్ అని వ్యాఖ్యానించారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 30 శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 73 శాతానికి చేరడం సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న పనితీరుకు, పురోగతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న డెలివరీలు, ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న ప్రజల విశ్వాసానికి, నమ్మకానికి మంచి ఉదాహరణలు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నారాయణ్ పెట్ జిల్లాలో 86.9%, మెదక్ 83.5%, జోగులాంబ గద్వాల్ 81.1% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు తక్కువగా నమోదు అవుతున్న వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో ఫలితాలు మెరుగుపడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ నమోదు అవుతున్న జిల్లాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఓవరాల్ పెర్ఫార్మెన్స్ విషయంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలను మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న హన్మకొండ, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలో పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ల వల్ల గర్భిణులకు ఎంతో మేలు అవుతుందన్నారు. 43 ఆసుపత్రుల్లో, ఏర్పాటు చేసిన 56 టిఫాల ద్వారా 32 వేల స్కాన్స్ చేయడం అభినందనీయం అన్నారు. ప్రతి గర్భిణికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు, వైద్యం పూర్తి ఉచితంగా అందించాలానే ప్రభుత్వ లక్ష్యం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలుగుతున్నదని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలకు గాను గత ఏడాది కాలంలో కోటి 60 లక్షలు వైద్య సిబ్బందికి టీం బేస్డ్ ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చినట్లు చెప్పారు. బిడ్డకు మొదటి గంటలో తల్లి పాలు అందించడం, సాధారణ ప్రసవాలపై కౌన్సిలింగ్ నిర్వహించడం వంటివి చేయాలని అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ విషయంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కరీంనగర్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను మంత్రి అభినందించారు.
హన్మకొండ, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేలా అందరం కలిసి కృషి చేయాలన్నారు.రాష్ట్రంలోని 18 ూఔఅఙ లను అనుసంధానం చేస్తూ, నిలోఫర్ ఆసుపత్రిలో జూన్ నెలలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పనితీరు గురించి మంత్రి సవిూక్షించారు. 24 గంటల పాటు సేవలు అందించి, నవజాత శిశు అరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాథమిక వైద్యాన్ని తక్షణం అందించేందుకు గాను, బస్తీ దవాఖానలు ప్రారంభించామని చెప్పారు. ఎక్కువ మందికి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఉచిత పరీక్షలు నిర్వహించి, క్వాలిటీ వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా అందిస్తున్న 134 రకాల పరీక్షలు ప్రజలకు అందాలన్నారు. కచ్చితంగా 24 గంటల్లోగా పరీక్షల ఫలితాలు అందించేలా చూడాలన్నారు.
0 కామెంట్‌లు