హైదరాబాద్ ఆగస్టు 11 (
ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాదీలకు అలెర్ట్. భయానక చెడ్డీ గ్యాంగ్ ఛాయలు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయి. ఇటీవల సిటీలోని మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు. దీంతో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో చెడ్డీ గ్యాంగ్ ఆగంతకులు కత్తులు పట్టుకుని వీధుల్లో సంచరిస్తున్నారు. నేర్పుగా మాటు వేసి.. అందరూ ఘాడ నిద్రలోకి వెళ్లిన తర్వాత.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను ఆ ప్రాంత ఎస్సై నిర్ధారించారు. మియాపూర్ వసంత విల్లాలో చొరబడ్డ దొంగలు.. 30 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ తచ్చాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు ఈ సీసీ టీవీ ఫుటేజ్ సర్కులేట్ చేస్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రివేళ్లలో ప్రజలంతా అలెర్ట్‌గా ఉండాలని, ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. రాత్రివేళ్లలో ఏదైనా అలికిడిగా అనిపించినా, ఎవరైనా డోర్ కొట్టినా.. వెంటనే తెరవద్దని సూచిస్తున్నారు.
మారణాయుధాలతో వీరి సంచారం చూస్తుంటే.. రాత్రి వీధుల్లో ఒంటరిగా సంచరించడం కూడా ప్రమాదకరమేని అర్థమవుతుంది.ఈ చెడ్డీ గ్యాంగ్స్ ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి మన సౌత్‌కు వస్తారు. మారణాయుధాలతో రాత్రుళ్లు సంచరిస్తూ ఉంటారు. ఒంటిపై చొక్కా, ఫ్యాంట్ లేకుండా, కేవలం చెడ్డీలు మాత్రమే ధరిస్తారు. ఎవరైనా పట్టుకున్నా తప్పించుకునేందుకు వీలుగా ఒళ్లంతా ఆయుల్ పూసుకుంటారు. ఎవరైనా ఎదిరిస్తే.. వారిపై దాడి చేసి చంపేందుకు సైతం వెనకాడరు. పగలు ఏమో రోడ్లపై బొమ్మలు, చీరలు అమ్మే సంచార కుంటుంబాల్లా కనిపిస్తారు. వీటిని అమ్ముకుంటునే తమకు అనువుగా ఉన్న ప్రాంతాలను, ఇళ్లను సెలక్ట్ చేసుకుని.. రాత్రి పూట అటాక్ చేస్తారు. అయితే వీరిని గుర్తించేందుకు ఒక ట్రిక్ ఉందని పోలీసులు చెబుతున్నారు. స్థానికుల్లా కలరింగ్ ఇచ్చేందుకు? మన భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారట. కానీ వారి మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తించవచ్చట.కాలనీ ప్రజలందరూ కలిసి గార్డును పెట్టుకోవడం లేదా.. ఇంటి చుట్టూ ఎలక్ట్రిక్ లేదా సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడం ద్వారా వీరిని నిలువరించవచ్చు. ఎందుకంటే.. అనువుగా లేని ఇళ్ల జోలికి వీళ్లు పెద్దగా వెళ్లరు. శివారు ప్రాంతాల్లో ఉంటున్నవారు ఇళ్ల చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం బెటర్. ఏదైనా ఊర్లు, తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ముందే పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు ఆ ఇళ్లపై నిఘా పెడతారు.
0 కామెంట్‌లు