హైదరాబాద్ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. మన్నెగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.చేనేత విూద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోదీ అని కేటీఆర్ మండిపడ్డారు. చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తుందన్నారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారు. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్కు తెలిసినంత ఎవరికి తెలియదు. సీఎం కేసీఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
చేనేతలకు రూ. 200 కోట్ల రుణాలు..
చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ. 200 కోట్ల రుణాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చేనేతలు తమ నివాసాల వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. నేతన్నకు చేయూత ద్వారా 59 నుంచి 75 ఏండ్ల వరకు బీమా అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపీ సేవలకు రూ. 25 వేలు ఇస్తామని ప్రకటించారు. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు..
మృతి చెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ. 25 వేలకు పెంచుతామని కేటీఆర్ తెలిపారు. నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు ప్రారంభిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులను కాపాడుకుంటానని 2001లోనే సీఎం కేసీఆర్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశాం. శ్రామికులుగా సూరత్ వెళ్లి పారిశ్రామికులుగా స్వరాష్ట్రం తిరిగి వచ్చారు. ఉప్పల్లో అద్భుతమైన హ్యాండ్లూం మ్యూజియం నిర్మిస్తాం. పోచంపల్లి హ్యాండ్లూం పార్కును రూ. 12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.