హైదరాబాద్,ఆగస్టు 5, (ఇయ్యాల తెలంగాణ ); అసెంబ్లీ ఎన్నికల పోరుకు సమయం అసన్నమవుతోంది. త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ రాబోతుంది. ఎవరికివారిగా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్లో టికెట్ కోసం అన్ని పార్టీల్లో కాంపిటీషన్ వాతావరణం నెలకొంది.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆయా పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. మొన్నటి వరకు ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచితే... ఇక మా వంతు అన్నట్లు బీఆర్ఎస్ కూడా షురూ చేసింది. కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో అలజడి మొదలైందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే చాలా సవిూకరణాలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చిన్న పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలను షురూ చేస్తున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కంటోన్మెంట్లో టికెట్ రేస్ మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలోని చాలా మంది నేతలు... ఈ టికెట్ కోసం తెగ పోటీ పడుతున్నారు. తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని పార్టీల హైకమాండ్ పెద్దలను కోరుతున్నారట..! దీంతో అసలు కంటోన్మెంట్లో టికెట్ రేసులో ఎవరు ఉండబోతున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.కంటోన్మెంట్... గ్రేటర్ హైదరాబాద్ లోని ఏకైక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. సికింద్రాబాద్ ఏరియాకు అనుబంధంగా ఉంటుంది. సైనికనివాస ప్రాంతంగా గుర్తింపు పొందింది. కొద్దిరోజుల కిందటే... ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మృతి చెందారు. దీంతో అందరి చూపు ఈ అసెంబ్లీ స్థానంపైనే పడిరది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావహుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందుగానే నేతల పోటాపోటీ కార్యక్రమాలతో కంటోన్మెంట్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ లిస్ట్ పెద్దగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల ఉన్న నేపథ్యంలో... అధికార బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత గజ్జల నగేశ్ తో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న మన్నె క్రిశాంక్, శ్రీ గణేశ్ తెగ సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. వీరేకాకుండా... ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ఇక్కడి టికెట్ ఆశిస్తున్నారన్న టాక్ ఉంది. అయితే సాయన్న వారసులుగా తమకే టికెట్ ఇవ్వాలని...ఆయన కుమార్తెలు నందిత, నివేదితలు కూడా కోరుతున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటూ... కేడర్ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతలు... పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. మన్నె క్రిశాంత్ బస్తీ నిద్రలు కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కంటోన్మెంట్ టికెట్ తమకంటే తమకు ఇవ్వాలన్నట్లు లెక్కలు వేసుకుంటున్నారట..! ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు సర్వే సత్యనారాయణ రేసులో ఉండగా... కొత్త నేతలు కూడా తమ పేర్లను పరిశీలించాలని హైకమాండ్ ను కోరుతున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఇక్కడ్నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. వీరికితోడు... అద్దంకి దయాకర్ కూడా టికెట్ దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం. వీరే కాకుండా... ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరిన విద్యార్థి నేత పిడమర్తి రవి ఈ టికెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరే కాకుండా... ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు కూడా కంటోన్మెంట్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.మొత్తంగా ఎన్నికల సవిూపిస్తున్న వేళ కంటోన్మెంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఐదుసార్లు ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహించిన సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందా లేక కొత్త నేతలకు ఛాన్స్ ఇస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఖరారు అవుతుందనేది చూడాలి...!