తల్లి నుంచి వారసత్వంగా గద్దర్‌కు అబ్బిన జానపదం !
హైదరాబాద్, ఆగష్టు 07 (ఇయ్యాల తెలంగాణ) : నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాజీవితంలో సాగారు. తల్లి నుంచి జానపదాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. అనంతర కాలంలో తన ఆటపాటలతో తెలుగు గడ్డను అలరించారు. ప్రజల ఆత్మీయ బంధువుగా మారారు. వివిధ సామాజిక రుగ్మతలపై పోరాడారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో విప్లవపంథాను ఎంచుకుని పాటలతో చైతన్య దీప్తిని వెలిగించిన గద్దర్ కొంత కాలానికి జనజీవనన స్రవంతిలోకి వచ్చినా తుదిశ్వాస విడిచేవరకు తనపాటతో చైతన్యవంతంగా జీవించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్ రాసిన పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. గద్దర్‌కు సతీమణి విమల, కుమారుడు సూర్యుడు, కుమార్తె వెన్నెల ఉన్నారు. రెండో కుమారుడు చంద్రుడు మరణించారు.ఆయన ఓ సామాజిక ఇంజినీరు : మెదక్ జిల్లా తూప్రాన్‌లో గద్దర్ జన్మించారు. తల్లిదండ్రులు గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్యల ఐదో సంతానం. ఉన్నత పాఠశాల విద్య వరకు తూప్రాన్, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సాగింది. గణితంలో 77% మార్కులు సాధించిన గద్దర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చేశారు. తండ్రి శేషయ్య మేస్త్రీ. మహారాష్ట్రలో మిలింద విశ్వవిద్యాలయం నిర్మాణ సమయంలో తన తండ్రి శేషయ్య అంబేడ్కర్‌ను చాలా దగ్గరగా చూశారని, ఆయన ప్రభావంతోనే పేదరికంలో ఉన్నా తమను పట్టుదలగా చదివించారని గద్దర్ ఒక సందర్భంలో వెల్లడిరచారు. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు గద్దర్ మొజాంజాహీ మార్కెట్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు.
అదే సమయంలో హైదరాబాద్‌లోని డిల్లీ దర్బార్ హోటల్లో ప్రతిరోజూ రెండు గంటలపాటు సర్వర్‌గా పని చేసేవారు. దళిత్ పాంథర్, నక్సల్బరీ ఉద్యమాల ప్రభావం గద్దర్‌ను ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టేలా చేసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. మొదట కెనరాబ్యాంకులో క్లర్క్‌గా చేరిన గద్దర్ 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆరంభంలో అంబేడ్కర్‌పై, తర్వాత అల్లూరి సీతారామరాజుపై బుర్రకథలు చెప్పారు. మొదట ఆర్ట్ లవర్స్ అసోసియేషన్‌లో చేరి అనంతరం ఉద్యమంలోకి వెళ్లారు.గద్దర్‌కు ఆ పేరెలా వచ్చిందంటే : గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్. కొంతకాలానికి రావ్ని తొలగించుకుని గుమ్మడి విఠల్‌గా మారారు. బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా’ అని రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్ కాకుండా వేరే పేరు రాయాలని భావించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలిగిన గదర్ (తిరుగుబాటు) పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకొని తన పేరును గదర్‌గా మార్చుకున్నారు. ప్రింటింగ్‌లో పొరపాటుగా గద్దర్‌గా ప్రచురితమైంది. నాటి నుంచి గద్దర్‌గానే ప్రాచుర్యంలోకి వచ్చింది.ఆ కర్ర... తండ్రి ఇచ్చిందే : గద్దర్ ఎక్కడికి వెళ్లినా పట్టుకెళ్లే కర్ర తన తండ్రిది. మొదట దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది. జ్యోతిబాఫులేకు గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు.
ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికే కారల్‌మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని, అందుకే ఎర్ర జెండా కట్టినట్లు చెప్పేవారు. ‘మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, ఫులే, అంబేడ్కర్ భావాలను కలపాలనేది’ తన వాదన అని పలుమార్లు తెలిపారు.‘మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్’ పుస్తకం ఆవిష్కరించకుండానే : గద్దర్ తను పుట్టిన ఊరిపై ఒక పుస్తకాన్ని రచించాలని భావించారు. 2015లో నెల రోజులపాటు తూప్రాన్‌లోనే ఉండి పుస్తకం రాసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. గ్రామంలో ప్రజల జీవన విధానంపై వీడియో చిత్రీకరిస్తూ సమాచారం సేకరించారు. పూర్వం కులవృత్తుల వారు ప్రజలకు ఎలా సేవలు అందించే వారో ఆ తరహాలోనే పనులు చేయించి వీడియో చిత్రీకరించారు. ‘మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్’ పుస్తకం రాయడం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ఆవిష్కరిస్తానన్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు.