.తిరుపతి ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ): .నేటి నుంచి మూడు రోజులపాటు ఆర్గానిక్ మేళా
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల అమృతతుల్యమైన ఆయుష్షు ఆరోగ్యం లభిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.నేటి నుంచి తిరుపతిలో ప్రారంభం కానున్న రాయలసీమ ఆర్గానిక్ మేళాను పురస్కరించుకొని గురువారం తిరుపతి తిలక్ రోడ్ లోని శ్రీదేవి కాంప్లెక్స్ నుంచి అందరికీ ఆరోగ్యం ఆరోగ్య పరుగు అమృత ఆహారం అనే నినాదాలతో ఆరోగ్య పరుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఈ ర్యాలీని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల వ్యవస్థాపకులు కుమారస్వామి ప్రారంభించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఇందుకు తగ్గట్లుగా తాము రైతులకు ఎప్పటికప్పుడు తర్ఫీదునిస్తూ తక్కువ ఖర్చులో ఎక్కువ పంటల దిగుబడి సాధించి ,తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామనని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్కాన్ గ్రౌండ్లో ఆరోగ్య పరుగు ముగింపు కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ జిల్లా అధికారి మునిరత్నం మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో తాము ఏడు వందల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చామని, తద్వారా వారు విషరహిత పంటలను పండిస్తూ ప్రజలందరికీ తక్కువ ధరలతో అన్ని రకాల పంటలను, కూరగాయలను అందిస్తున్నారని తెలిపారు. తమ సంస్థ తరఫున రైతులు తమ పంటలను ఈ మూడు రోజులపాటు జరిగే ఆర్గానిక్ మేళాలో ప్రదర్శన అమ్మకానికి పలు రకాల ఉత్పత్తులను స్టాల్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే కార్యక్రమాలకు తాము అన్నివేళలా ముందుంటామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వందకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రవికుమార్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు గంగాధరం, తిరుపతి టెర్రస్ గార్డెన్స్ కోర్ కమిటీ సభ్యులు టీవీ మనోహర్ కృష్ణ ఇంకా పలువురు ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు ఉత్సాహంగా ఈ ఆరోగ్య పరుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రైతులు పంగిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు పండ్లు ఈ ర్యాలీ లో ఆకర్షణగా నిలిచాయి..