హైదరాబాద్ ఆగష్టు 15 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.గత ఏడాది భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అని కేసీఆర్ కోరారు.75 ఏండ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్య్రం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్య్రానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు
దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఒక పవిత్ర యజ్ఞం;పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకువిూద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందని కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. ‘‘తెలంగాణ ఆచరిస్తుంది ? దేశం అనుసరిస్తుంది’’ అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్న తెలంగాణ; నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని కేసీఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారjైు తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1;ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు.. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం అని కేసీఆర్ చెప్పారు. ఈ రెండిరటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
వెలుగు జిలుగుల తెలంగాణ; విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసీఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది అని కేసీఆర్ తెలిపారు.
నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ..77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నేటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నదని కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది అని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నదని తెలిపారు.హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది అని కేసీఆర్ తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించింది అని కేసీఆర్ తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని, ఆస్తినష్టాన్నిచాలావరకు నివారించగలిగిందని సీఎం స్పష్టం చేశారు.అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని కేసీఆర్ హావిూ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది. జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలూ నిండుకుండలుగా మారాయి. ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
0 కామెంట్లు