హైదరాబాద్, ఆగస్టు 18, ఇయ్యాల తెలంగాణ; రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం అయి మూడు నెలలు గడుస్తోంది. ఈ మూడు నెలల్లో రైతులకు కన్నీరే మిగిలింది. జూన్ లో లోటు వర్షపాతం నమోదు కాగా.. వేసి విత్తనాలు అలాగే నాశనం అయిపోయాయి. చాలా చోట్ల విత్తనాలే మొలకెత్తలేదు. మెలకెత్తిన కాస్తో, కూస్తో పంటలను.. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలు నాశనం చేశాయి. అనేక రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మళ్లీ వరుణుడు కరుణ చూపించకపోవడంతో... మళ్లీ జూన్ నెల నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో సాధారణ వర్షపాతం 217.4 మిల్లీ విూటర్లు. ఈనెల 15వ తేదీ వరకు 108.4 మిల్లీ విూటర్లు కురవాల్సి ఉండగా.. 19.9 మిల్లీ విూటర్లే నమోదు అయింది. అంటే దాదాపు 82 శాతం లోటు ఉంది. ఈనెల ప్రారంభం నుంచి 23 జిల్లాల్లో అప్పుడప్పుడూ వర్షాలు కురవగా... మిగిలిన జిల్లాల్లో వరుణుడి జాడే కనిపించలేదు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, యాదాద్రి జిల్లాలోని 28 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ వంటి పంటలకు, వరి పొలాలకు నీరు అందించాలి. ప్రస్తుతం ఆశించిన వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లు, బావులు, చెరువులపై ఆధార పడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాల్లో వరి పొలాలకు బోర్లు, బావుల నుంచి నీటిని పారిస్తున్నారు. జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం, మంచిర్యాల, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని వర్షాధార పంటలకు నీటి వసతి లేక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 466.9 మిల్లీ విూటర్లు. ఇప్పటి వరకు 582.4 మిల్లీ విూటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణ వర్షపాతాన్ని దాటినా.. అత్యధిక శాతం ఒక్క జులైలోనే కురవడంతో.. పంటల సాగుకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోని రైతన్నలు కన్నీరు పెడుతున్నారు ఈ ఏడాది పంట నష్టం విూద పడినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ లో సాధారణంగా 129.4 మిల్లీ విూటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 72.6 మిల్లీ విూటర్ల వర్షం మాత్రమే కురిసింది. అలాగే జులైలో 229.1 మిల్లీ విూటర్ల వర్షపాతం నమోదు అవ్వాల్సి ఉండగా... అత్యధికంగా 489.9 మిల్లీ విూటర్ల వర్షం కురిసింది. ఆగస్టు 15వ తేదీ వరకు 108.4 వర్షం కురవాల్సి ఉండగా.. 19.9 మిల్లీ విూటర్ల వర్షం మాత్రమే కురిసింది.
0 కామెంట్‌లు