న్యూఢల్లీ ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ ): రాజ్యసభ నుంచి విపక్షం వాకౌట్
పార్లమెంట్లో మణిపూర్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.ప్రధాని సభకు రావాలని కోరుతూ వాకౌట్కు ముందు విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు.
మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ గత కొద్దిరోజులుగా విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లుతున్నాయి. ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ గురువారం రెండోసారి విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.మరోవైపు లోక్‌సభలోనూ మణిపూర్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాగా, మణిపూర్, హరియాణలో హింసాకాండపై బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో బీజేపీనే గందరగోళం సృష్టిస్తోందని, కాషాయ నేతలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తున్నారని, ఆ పార్టీ ప్రతి చోటా విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.