పెద్దపల్లి ఆగష్టు 7, (ఇయ్యాల తెలంగాణ ):ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.21వేలు చెల్లించాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటుకూరి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో జిల్లాలోని ఆశా వర్కర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షురాలు అనవేన స్వరూప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 17యేళ్ళుగా జీతమెంతో తెలియకుండానే పని చేస్తున్నా ఆశా వర్కర్ల సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోవాల న్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అధిక పనిభారం తగ్గించాలని, ఆరోగ్య భీమా అమలు సౌకర్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశావర్కర్ల సమస్యలపై చర్చించాలన్నారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ఆశా కార్యకర్తలు పని చేశారని గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టులను అర్హత గల ఆశా వర్కర్లతో భర్తీ చేయాలని, పెన్షన్, రిటైరుమెంటు సదుపాయాలు, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేషంలో ఆశా వర్కర్లు శివాల జ్యోతి, నెరువట్ల రజిత, లక్ష్మి, మమత, రాజేశ్వరి, కరుణ, పద్మ, స్వప్న శోభ, సరోజన, లక్ష్మి, జ్యోత్స్న, ప్రవిూల, రమాదేవి, రజిత, శారధ, తదితరులు పాల్గొన్నారు.