హైదరాబాద్, ఆగస్టు 29 (ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయ పార్టీ వచ్చే ఎన్నికల కోసం 5 సీ ఫార్ములాతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. కాన్ఫిడెన్స్, కమిట్ మెంట్, క్రెడెబులిటీ, క్లారిటీ, కోఆర్డినేషన్ తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కచ్చితత్వంతో అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కాన్ఫిడెంట్ గా ప్రజలకు తామున్నామనే భరోసా ఇస్తూ క్రెడిబులిటీని సాధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసి బహిరంగ సభ అనంతరం ఆదివారం పార్టీ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా దాదాపు 25 నిమిషాల పాటు చర్చించారు. వచ్చే ఎన్నికలపై కోర్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికలకు ఇప్పుడున్న స్పీడ్ సరిపోదని, బీఆర్ఎస్ తో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.తెలంగాణలో రానున్న ఎన్నికల సవిూకరణాలు, రాజకీయ పరిస్థితులపై బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రధానంగా చర్చ సాగినట్లు చెబుతున్నారు. పార్టీ ఏ జిల్లాలో బలంగా ఉంది? ఎక్కడెక్కడ గెలవగలం ? ఎన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలం ? రాష్ట్ర కమిటీ దగ్గరున్న సమాచారాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.బీఆర్ఎస్ కు కళ్లెం వేయడంతో పాటు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన పూర్తి సహకారం నేతలకు ఉంటుందని షా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలున్నాయని, పోరాడాల్సిందేనని షా ఫుల్ క్లారిటీతో పాటు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని, వాటిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని అమిత్ షా సూచించారు.తెలంగాణలో ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో నేతలు సమన్వయంతో కలిసిపోవాలి అమిత్ షా సూచించారు. నేతల మధ్య అధిపత్య పోరు, గ్రూపులు ఉండొద్దని, ఐక్యంగా కలిసి పని చేయాలని ఉపదేశించారు. శత్రువులను ఎదర్కోవడం చాలా సులభమని, కానీ సొంత పార్టీ నేతలే కొట్టుకుంటే శత్రువును కొట్టడం కష్టమని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కొన్ని తప్పిదాల కారణంగా కర్ణాటకలో ఓటమిని ఉదాహరణగా చెప్పినట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో జన బలం ఉన్న నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రథయాత్రలు చేపట్టేందుకు జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచనలు చేసింది. పార్టీ అందరికీ అవకాశాలిస్తుందని, అందులో ఎలాంటి సందేహం వద్దని, అవకాశాలు రాలేదని చెప్పి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ మారాలని ఆలోచిస్తున్న నేతలకు ఉద్దేశించి అమిత్ షా పరోక్షంగా సూచించారు.నేతలు ఎవరేం చేస్తున్నారనేది హైకమాండ్ అన్నీ గమనిస్తోందని షా స్పష్టంచేసినట్లు సమాచారం. ఎవరో ఏదో తప్పు చేస్తున్నారని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదని, ఎవరికి కేటాయించిన పనిని వారు సక్రమంగా చేసుకోవాలని, అంతేకాకుండా అసెంబ్లీ సెగ్మెంట్లనూ పార్టీని బోలోపేతం చేసుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీని కాపాడితే.. పార్టీయే నేతలను కాపాడుకుంటుందనే విషయాన్ని మరిచిపోవద్దని తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా ఉపదేశించారు.
తెలంగాణ నేతలకు 5 C FORMULA
మంగళవారం, ఆగస్టు 29, 2023
0
Tags