జగిత్యాల ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా కొనుగోలు చేసిన పట్టణ ప్రాంత వ్యవసాయేతర భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 84 తేదీ26.07.2023 ద్వారా వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలో నోటరీ భూములు కలిగి ఉన్న వారు విూ`సేవ ద్వారా అక్టోబర్ 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీ.వో 84 ను అనుసరిస్తూ,125 గజాల లోపు స్థలం కలిగి ఉన్న వారి నోటరీ ప్లాట్లను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా రెగ్యులరైజెషన్ చేయడం జరుగుతుందని, 125 గజాలు దాటిన వాటికి ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ, రూ. 5 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. విూ`సేవ ద్వారా దరఖాస్తు చేసే సమయంలో నోటరీ డాక్యూమెంట్ తో పాటు ఆ భూమికి సంబంధించిన లింక్ డాక్యూమెంట్లు, ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, నీటి పన్ను చెల్లించిన రసీదులు, ఇతర ఆధారాలు ఉంటే వాటిని జత చేయాలని సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ వల్ల పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయని, సులభంగా క్రయవిక్రయాలు జరుపుకోవచ్చని, బ్యాంకు ద్వారా రుణాలు పొందే వెసులుబాటు ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారందరూ నిర్ణీత గడువులోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.