మదనపల్లి, ఆగస్టు 27(ఇయ్యాల తెలంగాణ ):దాదాపు రెండు నెలల పాటు టమాటా ధరలు ప్రజలకు ముప్పు తిప్పలు పెట్టాయి. టమాటా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని కొనేందుకు చాలా మంది వెనకడుగు వేశారు. మరికొందరైతే టమాటాలను వంటల్లో వాడటమే ఆపేశారు. అయితే టమాటాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హర్యాణా రాష్ట్రాల్లో ఎక్కవగా పండిస్తారు. అయితే ఈ రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడవ వల్ల ధరలు క్రమంగా దిగివస్తున్నట్లు ఇటీవలే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడిరచింది. గత జులై నెలలో కిలో టమాటా ధరలు ఏకంగా 250 రూపాయలు పెరిగాయి. అయితే ప్రస్తుతం టమాటా ధరలు క్రమంగా పలు ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మరో విషయం ఏంటంటే వచ్చే సెప్టెంబర్ రెండో వారం నాటికి టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.సాధారణ స్థాయి అంటే కిలో టమాటా ధరలు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు చేరుకుంటాయని అంచనా వేసింది. ఇటీవలే మహారాష్ట్రలోని నాసిక్‌లో పింపాల్హగావ్ బస్వంత్ అనే మార్కెట్‌కు క్రమంగా టమాటాల రాక పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా టమాటా సరఫరా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. చాలా నగరాల్లో టమాటా ధరలు క్రమంగా తగ్గుతున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు అంటే అక్కడ స్థానికంగా తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామంది ప్రజలు అక్కడ టమాటాలు కొనుక్కొని వెళ్లేందుకు క్యూలు కడతారు. అయితే టమాటా ధరలు ఎక్కువ రేటు ఉన్న నేపథ్యంలో తాజాగా ఆ మర్కెట్‌కు ఇప్పుడు కొత్త కళ వచ్చేసింది.ఆ వ్యవసాయ మార్కెట్ యార్డులో టామాటా కొనుగోళ్లు శుక్రవారం నుంచే పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యాయి. రైతులు మొదటిరోజునే దాదాపు 10 టన్నుల సరకును ఆ మార్కెట్‌కు తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన టమాటాలపై వేలం వేశారు. ఈ వేలంలో క్వింటాలు టమాటాకు వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరే పలికింది. అయితే ఇది చాలా తక్కువ. దీనివల్ల ఇప్పుడు కిలో టమాటా ధరలు 10 రూపాయల వరకు మాత్రమే ఉంటాయి. అయితే దీనివల్ల తాము చాలా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాటాలు అధిక దిగుబడి వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల టమాటా ధరలు పతనం అవుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో చూసుకుంటే వినియోగదారులుకిలో టమాటాకు 30 నుంచి 40 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చేసింది.