Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు - CJగా అలోక్‌


 
తెలంగాణ సీజేగా అలోక్‌

హైదరాబాద్‌, జూలై 20, (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త సీజే నియామకం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే నియమితులయ్యారు. జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జిగా సేవలు అందిస్తున్న మరో జడ్జి జస్టిస్‌ సామ్‌ కొశాయ్‌ తెలంగాణ హైకోర్టు జడ్జిగా ట్రాన్స్‌ ఫర్‌ అయ్యారు. పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం జులై 5న సిఫారసు చేయడం తెలిసిందే. మొత్తం ఐదుగురు జడ్జిల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టుతో పాటు కేరళ, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియించినట్లు ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సునితా అగర్వాల్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు.  కేరల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆశిష్‌ జే దేశాయ్‌ నియమితులయ్యారు. వారు ప్రస్తుతం గుజరాత్‌ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నారు. ఒడిశా హైకోర్టు సీజేగా సుభాషిస్‌ తలపత్ర నియమితులు కాగా, ప్రస్తుతం అదే కోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశా హైకోర్టు ప్రస్తుత సీజే ఎస్‌ మురళిధర్‌ ఆగస్టు 7న రిటైర్మెంట్‌ కానున్నారు.  

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ప్రస్థానమిలా..

జస్టిస్‌ అలోక్‌ అరాధే 1964 ఏప్రిల్‌ 13న ప్రస్తుత ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌ పూర్‌ లో జన్మించారు. 1988లో న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2016 సెప్టెంబరు 16న జమ్మూ కశ్మీర్‌ న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆ రాష్ట్ర జ్యూడీషియల్‌ అకాడవిూకి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఛైర్మన్‌ గా నియమితులై సేవలు అందించారు. 2018లో 3 నెలల పాటు జమ్ము కశ్మీర్‌ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరించారు. 2018 నవంబరు 17 నుంచి కొంతకాలం కర్ణాటక హైకోర్టు జడ్జిగా చేశారు. ఆపై అదే రాష్ట్ర హైకోర్టు సీజేగా నియమితులై సేవలందించారు. ఇటీవల కొలీజియం కొందరు జడ్జీల పేర్లను సిఫార్సు చేయడం, అందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో బుధవారం తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు