Ticker

6/recent/ticker-posts

Ad Code

తెలంగాణ కాంగ్రెస్‌ లో జోష్‌

హైదరాబాద్‌, జూలై 19, (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త సమస్య వచ్చింది. అధిష్టానం చేరికలను ప్రోత్సహించంతో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్‌ బాటపట్టారు. అయితే పార్టీలోకి చేరుతున్న వాళ్లు సీటు హావిూ పొందుతున్నారు. అయితే పాత వాళ్ల పరిస్థితేంటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌ లోకి క్యూ కడుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ లో జోష్‌ పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఇతర పార్టీల్లోని పలువురు కాంగ్రెస్‌ తో టచ్‌ లోకి వస్తున్నారని నేతలు అంటున్నారు. పార్టీలోకి కొత్తగా చేరుతున్న వారికి సీట్లపైన హావిూలు దక్కుతుండడంతో...ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకొని అంకితభావంతో ఉన్న నేతలు...తమ పరిస్థితి ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌ చేరడంతో..సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరందని అధిష్ఠానం ఎలా సమన్వయం చేస్తుందని ప్రశ్న మొదలైంది. సీట్ల విషయంలో హైకమాండ్‌ అనుసరించే ఫార్ములా ఏంటి? ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది? ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ లో ప్రధాన చర్చగా మారింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ లో చేరికల ప్రవాహం పెరిగింది. పార్టీలో చేరేందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో మంతనాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. పార్టీలో చేరుతున్న వారంతా తమకే సీటు కావాలని షరతు పెడుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించి ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం.. వచ్చే వారికి హావిూలు గుప్పిస్తుంది. కొత్త వారు చేరికలు అవసరమే అయినా..పాత వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసి వారంతా... తమ నియోజకవర్గాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్నారని నేతలు అంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకునే క్రమంలో సీట్ల హావిూలు ఇస్తుండటంతో పాత వారికి రుచించటం లేదు. దీంతో పార్టీకి ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ లోని కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూలు నియోజకవర్గాల్లో చేరికలపైన నాగం జనార్ధనరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దామోదర్‌ రెడ్డి తన కుమారుడికి సీటు పైన హావిూ కోరారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరికకు సిద్దమయ్యారని తెలుస్తోంది. తన వర్గానికి సీట్లపైన హావిూ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు. ఖమ్మం జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరటమే కాక సీటు పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో సీతక్క కుమారుడు అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి మరిన్ని చేరికలు ఖాయమయ్యాయని ప్రచారం జరుగుతున్న సమయంలో వారికి ఇస్తున్న హావిూలతో పార్టీనే నమ్ముకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.కొత్త నేతలను చేర్చుకోవటం పైన అభ్యంతరం లేదంటున్న సీనియర్లు... సీట్ల విషయంలో మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న వారి కంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అంటిపెట్టుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త వారికే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తే నష్టం తప్పదనంటున్నారు. అధికారమే దిశగా పార్టీకి అన్ని రకాలుగా కలిసి వస్తున్న సమయంలో పాత వారికి ఎక్కడా నష్టం లేకుండా, అదే సమయంలో కొత్త వారిని ఆకట్టుకునేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధిష్ఠానంపై ఉందంటున్నారు సీనియర్లు.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు