నల్గోండ, జూలై 22, (ఇయ్యాల తెలంగాణ ):సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. యువతను పెడదారి పట్టిస్తూ ఒళ్ళు, ఇళ్లును గుల్ల చేస్తున్న మద్యాన్ని కట్టడి చేయాలని ఇక్కడి గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలోని బెల్ట్ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. ఇందుకోసం.. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులు మద్యపానం నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఆదర్శ గ్రామమేదో మనం కూడా తెలుసుకుందాం..సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గ్రామం తమరబండ పాలెం. 800 గ్రామ జనాభా ఉంది. ఇక్కడి వారంతా వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట దసరా పండుగ రోజూ ఇద్దరూ వ్యక్తులు మద్యం తాగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ కుటుంబాల మధ్య చిచ్చుకు దారితీసి గ్రామంలో అశాంతి నెలకొంది. నాటి గ్రామ పెద్దలు.. గ్రామం బాగుండాలి అంటే ఊరిలో సారా, మద్యం అమ్మకూడదు, తాగకూడదని నిర్ణయించారు. నాటి నుంచి మద్యం తాగినా, అమ్మినా జరిమానా విధించాలని గ్రామస్తులు కట్టుబాటు చేసుకున్నారు. గ్రామ కట్టుబాటును ధిక్కరిస్తే రూ. 5 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గ్రామస్తులంతా బాండ్ పేపర్ పై రాసి సంతకాలు చేశారు.అయితే గతంలో ఓసారి ఇద్దరూ, ముగ్గురు వ్యక్తులు గ్రామ కట్టుబాటుకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులను తెరిచారు. గ్రామ పెద్దలు మందలించినా.. బెల్ట్ షాపులను కొనసాగించారు. ఎవరూ మద్యాన్ని
కొనకపోయేసరికి చేసేదేమి లేక వారు స్వచ్ఛందంగా బెల్ట్ షాపును మూసేశారు. ఎవరైనా మద్యం తాగాలనుకున్నా.. బంధువులు వచ్చిన.. సవిూపంలోని కోదాడ పట్టణానికి వెళ్లాల్సిందే. మద్యానికి వ్యతిరేకంగా నాటి పెద్దలు విధించిన సంపూర్ణ మద్యపానం నిషేధాన్ని నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచింది.