వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలు
కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశం
మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల మాంసాహారాన్నిపడేస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 ( ఇయ్యాల తెలంగాణ) : నగరంలోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలుడిపై కుక్కలు మూక్కుమ్మడిగా దాడి చేస్తున్న దృశ్యాలు చూసి ప్రతీ ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ క్రమంలో వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం గైడ్ లైన్స్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని... కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలని పేర్కొంది. మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని... అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్‌ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.