హైదరాబాద్, జనవరి7 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అవును.. ఆ 12 మందే.. తెలంగాణ కాంగ్రెస్ లెటెస్ట్ టార్గెట్! కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలపై యుద్ధం ప్రకటించింది. అదే టైమ్‌లో బీఆర్ఎస్ ను ఇరుకునపెడుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పాట్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో.. ముగ్గురు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్లో చేరినవారే. ఇదిగో ఈ పాయింట్‌నే పట్టుకొని స్ట్రైట్‌గా లాగుతోంది కాంగ్రెస్. ఆ ముగ్గురికి అమ్మడుపోవడం అలవాటుగా మారిందని ఆరోపిస్తోంది. ఈ ముగ్గురే కాదు.. పార్టీమారిన 12 మంది ఎమ్మెల్యేలపైనా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుతో ఎం జరగబోతోంది?
పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మెయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పీసీసీ. వీళ్లంతా.. బీఆర్ఎస్ నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందారని పేర్కొంది. వాళ్లకు కలిగిన రాజకీయ, ఆర్థిక లాభాలను కూడా సవివరంగా.. కంఫ్లైంట్ కాపీలో వివరించింది కాంగ్రెస్. అందరిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేసింది.పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ నిరసనలకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్. ఓ వైపు విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయడం.. మరోవైపు న్యాయపోరాటం చేస్తూనే.. ఆందోళనలూ చేపట్టాలని నిర్ణయించింది. 2023 ఎన్నికల్లో మళ్లీ ఆ 12 మంది గెలువకుండా చూడటమే తమ టార్గెట్ అని ప్రకటించింది కాంగ్రెస్.కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను విడిచిపెట్టబోమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వారి గురించి పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఒకవేళ వారు కూడా స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ చట్ట సభల్లో అడుగు పెట్టకుండా రాజకీయంగా పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. టీపీసీసీ నాయకులు శుక్రవారం (జనవరి 6) మధ్యాహ్నం దాటాక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీస్ స్టేషన్ లో కనీసం ఉన్నతాధికారులు కూడా అందుబాటులో లేరని విమర్శించారు. ‘‘పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హావిూలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. అయినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదులపై స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదు. పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేయాలి. పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరం.