Ticker

6/recent/ticker-posts

Ad Code

కమలం గూటికి పీజేఆర్‌ తనయుడు..?


హైదరాబాద్‌, డిసెంబర్‌ 29, (ఇయ్యాల తెలంగాణ) :  బీజేపీలోకి పీ జనార్దన్‌ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్‌ రెడ్డి చేరిక దాదాపు కన్ఫామ్‌ అయిపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా పార్టీ యాక్టివిటీస్‌కి దూరంగా ఉన్న ఆయన.. కొత్త సంవత్సరంలో కాషాయతీర్థం పుచ్చుకుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉంటే సంక్రాంతి తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం దివంగత నేత జనార్దన్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు బీజేపీకి చెందిన ప్రముఖులు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనిది కాషాయ పార్టీకి చెందిన నేతలు పీజేఆర్‌ వర్ధంతికి వెళ్లి నివాళులర్పించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విష్ణువర్ధన్‌ రెడ్డి త్వరలోనే కమలం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే సంక్రాంతి తర్వాత మంచిరోజు చూసుకుని ఆయన కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై విష్ణువర్ధన్‌ రెడ్డి బహిరంగంగానే కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన సోదరి విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరింది. ఈ విషయం అటు పార్టీ కానీ, తన సోదరి కానీ చెప్పకుండా వెళ్లడంపైనా విష్ణువర్ధన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ కారణాల వల్లే ఆయన బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగా నేతలను చేర్చుకోవడంపై శ్రేణులు దృష్టిసారిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ నేతలపై కన్నేసిన కమలనాథులు ఇప్పటికే పలు దఫాలుగా విష్ణువర్ధన్‌ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలను బీజేపీలోకి చేర్చుకునే బాధ్యత ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన నేతలను అధిష్టానం అప్పగించిన విషయం తెలిసిందేదీంతో ఎవరికి సన్నిహితంగా ఉన్న నేతలకు వారు స్వయంగా ఫోన్లు చేసి టచ్‌ లోకి వెళ్లి కాషాయ పార్టీకి వెల్‌ కం కూడా చెప్పారు. కాగా పలువురు కాంగ్రెస్‌ నేతలు తమకు టికెట్‌ కన్ఫామ్‌ చేస్తే వస్తామని షరతులు విధించారు. అది తమ చేతుల్లో లేదని, కానీ కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందనే భరోసాను మాత్రం కల్పించారు. దీంతో జాయినింగ్స్‌ సందిగ్ధంలో పడిరది. కాగా గత కొద్ది రోజులుగా విష్ణువర్ధన్‌ రెడ్డి బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలకు పీజేఆర్‌ వర్ధంతికి బీజేపీ నేతలు వెళ్లడం మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.జనార్దన్‌ రెడ్డి వర్ధంతికి కాంగ్రెస్‌ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ మాత్రమే పీజేఆర్‌కు నివాళులర్పించేందుకు వచ్చారు. కానీ బీజేపీ నుంచి మాత్రం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వారికి ఏనాడూ అందని ఆహ్వానం తాజాగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా విష్ణువర్ధన్‌ రెడ్డి చేరిక వెనుక డీకే అరుణ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆమెకు కూడా ఆహ్వానం అందినా శిక్షణ తరగతుల కారణంగా హాజరుకాలేకపోయినట్లు సమాచారం. గతంలో పలుమార్లు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన మర్రి శశిధర్‌ రెడ్డి కూడా వర్ధంతి రోజున మాత్రం ఏనాడూ హాజరైంది లేదు. కానీ ఇప్పుడు వెళ్లి నివాళులర్పించడంతో పాటు తన స్నేహితుడిని తలుచుకుని కంటతడి పెట్టడం గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు