Ticker

6/recent/ticker-posts

Ad Code

రెండు వర్గాలుగా " గాంధీభవన్‌ "

హైదరాబాద్‌, నవంబర్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : టీకాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు గుప్పుమంటోంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌ పై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి వైఖరి అస్సలు బాగోలేదని ఆయన వల్లే పార్టీ మరింత కష్టాల్లోకి నెట్టబడుతోందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ప్రజల్లోకి దూసుకుపోవాలని ప్రణాళికలు వేసుకుంటుంటే కాంగ్రెస్‌లో మాత్రం నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత కొంత కాలంగా సర్దుకున్నట్టుగా ఉన్న సీనియర్ల పోరు మరోసారి రేవంత్‌ రెడ్డికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా అదే బాటలో మర్రిశశిధర్‌ రెడ్డి ప్రయాణించబోతున్నారు. పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కొరకరాని కొయ్యగా మారితే మరో సీనియర్‌ నేత జగ్గారెడ్డి రేవంత్‌ పై చిటపటలాడుతున్నాడు. సీనియర్లు వరుసగా రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసినా రేవంత్‌ రెడ్డి మాత్రం కాస్త సైలెంట్‌ గానే ఉంటున్నాడనే టాక్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డి మౌనం వెనుక భారీ వ్యూహం ఉందని అందువల్లే ఆయన అదును కోసం ఎదురు చూస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలోని ఓ వర్గం నుంచి వ్యక్తం అవుతోంది.కాంగ్రెస్‌ లో చేరిన అతి కొద్ది కాలానికే రేవంత్‌ రెడ్డి పార్టీలో కీలక నేతగా పేరు సంపాదించుకున్నాడు. 


తనదైన దూకుడు స్వభావంతో అధిష్టానం వద్ద కూడా మార్కులు కొట్టేశారు. దీంతో రేవంత్‌ రెడ్డి క్రేజ్‌ చూసిన పార్టీ పెద్దలు ఎప్పటినుంచో కొనసాగుతున్న సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించారు. దాంతో గాంధీ భవన్‌ లో రెండు వర్గాలుగా చీలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని సీనియర్లు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్‌ దొరికినా మరో ఆలోచన లేకుండా విమర్శనాస్త్రాలకు దిగుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వారిపై కౌంటర్‌ ఇవ్వకపోవడం వెనుక రేవంత్‌ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌ రెడ్డి తీరు తనకు నచ్చడం లేదని, చెంచాగాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో పది పదిహేను సీట్లను గెలిపించుకుని తన సొంత దుకాణం చూసుకునే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నారని శశిధర్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి.కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం అంటున్న రేవంత్‌ రెడ్డి.. భవిష్యత్‌ లో కొత్త పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారనే ఆరోపణలు కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ కారణంతోనే సీనియర్లను విమర్శలు చేస్తున్నా రేవంత్‌ రెడ్డి ఓపికగా ఉంటున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండుదఫాల టీఆర్‌ఎస్‌ పాలన చూసిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్‌ కు అవకాశం ఇస్తారనే ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అయితే సీనియర్లు సహకరిస్తే కలిసిముందుకు సాగడం లేదా ఇలానే పోరు పెడుతుంటే ఎన్నికల తర్వాత తనతో కలిసి వచ్చే ఎమ్మెల్యేలను తీసుకుని సొంత కుంపటి పెట్టుకోవడం దిశగా రేవంత్‌ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారా? అనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. అయితే మర్రి శశిధర్‌ రెడ్డి నిజంగానే రేవంత్‌ రెడ్డి వ్యూహాన్ని పసిగట్టి ఈ వ్యాఖ్యలు చేశారా? లేక పార్టీని వీడుతూ వీడుతూ రేవంత్‌ ను ఇరకాటంలోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారా? అనేది సస్పెన్స్‌ గా మారింది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు