మాస్కో , మార్చ్ 2 (ఇయ్యాల తెలంగాణ) : మూడో ప్రపంచ యుద్ధం వస్తే, ఖచ్చితంగా అణ్వాయుధాలతోనే పోరాటం జరుగుతుందని, అది అత్యంత విధ్వంసకరమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ బుధవారం చెప్పారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలను సంపాదిస్తే తాము అసలు సిసలు ప్రమాదాన్ని ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. అయితే తాము అలా జరగనివ్వబోమని చెప్పారు. లవ్రోవ్ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, మూడో ప్రపంచ యుద్ధం వస్తే, కచ్చితంగా అణ్వాయుధాలతోనే పోరాటం జరుగుతుందని, అది అత్యంత విధ్వంసకరమని లవ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలను సంపాదిస్తే రష్యా అసలు సిసలు ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నారు. అయితే అణ్వాయుధాలను సంపాదించే అవకాశాన్ని ఉక్రెయిన్‌కు తాము ఇవ్వబోమన్నారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఏడో రోజు బుధవారం కూడా యుద్దం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు మునుపెన్నడూ లేని స్థాయిలో ఆంక్షలను విధిస్తున్నాయి. మరోవైపు జపొరిజ్య న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పైనా, ఖెర్సోన్ నగరంపైనా నియంత్రణ సాధించామని రష్యా ప్రకటించింది. కీవ్‌లోని ప్రధాన టీవీ టవర్‌ను ధ్వంసం చేసింది. లవ్రోవ్ మంగళవారం ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ప్రసంగిస్తున్నపుడు అనేక మంది దౌత్యవేత్తలు వాకౌట్ చేశారు.