శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఉపవాసం ఎందుకు ? జాగారం ఎందుకు ?
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.
అయినా , శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి , జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది...
శివరాత్రి విశేషాలు...
అమవాస్య ముందురోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మాహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాసశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి, దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండివంటనే గుర్తుకువస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ! ఉపవాసజాగరణలతో శివసాయుజ్యానికై తపించే వేడుక! అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు... వాటి వెనుక ఉన్న విశేషాలు...
చతుర్దశి విశేషం !
పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒకో రోజూ గడిచేకొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి, ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి- నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామంతో ఉత్తేజితం అవుతుంది. రెండు- ఎటువంటి కష్టం వచ్చినా, వాటిని ఆ భగవంతుని మీద భారం వేసే నమ్మకం కలుగుతుంది. మర్నాడు నిస్సత్తువగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.
మాఘ శివరాత్రే ఎందుకు !
శివరాత్రినాటికి చలి, శివశివా అని వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథసప్తమినాటికి మొదలయ్యే సూర్యకిరణాల తీక్షణత మరుసటి వారంనాటి శివరాత్రికి వేడినందుకుంటాయి. అంటే శివరాత్రినాటికి చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్తా అనుకూలించాలి కదా! అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే!