హైదరాబాద్,ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు భారత రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు దళితరత్న పొలిమేర సంతోష్ కుమార్ ఆధ్యర్యంలో నిరసన కార్యక్రమమం నిర్వహించారు.సనత్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎనభై వేల పుస్తకాలు చదివానని బీరాలు పలికే తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి సముపార్జించిన (అ)జ్ఞాన సంపద ఇదేనా అని ఎద్దేవా చేసారు. వ్యక్తిగతంగా తనకు లేకపోయినా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తాను బాధ్యత చేపట్టిన విషయం కూడా ముఖ్యమంత్రికి గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి హోదాకైనా గౌరవం ఉండేలా ప్రవర్తించకుండా నిరక్షరాస్యులు కూడా సిగ్గు పడేలా నీచాతినీచమైన స్థాయికి దిగజారి అసభ్యమైన, జుగుప్సాకరమైన భాష మాట్లాడటం కేసీఆర్ కే చెల్లిందన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్తను, భారత రాజ్యాంగం పట్ల ఇలాంటి పరుష పదజాలాన్ని ఉపయోగించిన వ్యక్తిగా ఆయన రాజ్యాంగం ద్వారా సిద్ధించే ఏ పదవికి కూడా అర్హుడు కాడని, రాజ్యాంగం పట్ల గౌరవం లేని కేసీఆర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేసి తానూ చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు నిలబడి ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మహంకాళి జిల్లా బీజేపీ ఎస్ సి మోర్చా ఉపాధ్యక్షుడు వై శ్రీనివాస్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, దిశా సభ్యుడు చరణ్ సింగ్, ఆకూరి శ్రీనివాస్ రావు, సి వి శ్రీనివాస్ రావు, గోపి, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.