చర్యలు తీసుకోవాల్సిందింగా వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదు
సనత్ నగర్, జనవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ ప్రధాన రహదారిపై కొన్ని ప్రైవేట్ హోటళ్ల నిర్వాకం తో స్థానిక బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సనత్ నగర్ పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫతేనగర్ డివిజన్ HMWS&SB మేనేజర్ మరియు సంజీవ రెడ్డి నగర్ లోని HMWS&SB జనరల్ మేనేజర్ ను కలిసి తమ ఫిర్యాదును అందచేశారు. సనత్ నగర్ లోని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఎదురుగా ఉన్న సంతోష్ ధాబా మరియు రెండు టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తమ మురుగు నీటిని స్థానికంగా కాలనీ నివాసితుల కోసం ఏర్పాటుచేయబడిన సీవరేజ్ లైన్ లో కలపుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సమస్య తీవ్రతను పరిశీలిస్తున్న సనత్ నగర్ పరిరక్షణ కమిటీ
ఈ ప్రాంతంలో తరచూ మురుగు నీరు నిలిచి పోయి స్థానికులకు చాలా రకాలుగా ఇబ్బందికరంగా మారడమే కాక ప్రస్తుత కరోన మహమ్మారి తన కొత్త రూపమైన “ఓమిక్రాన్” రూపంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజారోగ్యంపై దుష్ప్రభావం కలుగుతోందని దీని వల్ల ఇక్కడ స్థానిక వాసులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సనత్ నగర్ పరిరక్షణ కమిటీ ప్రతినిథులు యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస రావు, పొలిమేర సంతోష్ కుమార్, వై ఎస్ రావు, బినయ్ శర్మ, గంగాళం వెంకటేష్, అక్రం ఖాన్, భూషణ్ రాఠి కోరారు.