అభివృద్ధి కార్యక్రమాలు సమాజానికి లబ్ది చేకూరేలా ఉండాలని హితవు
హైదరాబాద్, డిసెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ పారిశ్రామిక వాడ ఉద్యానవనం పరిసరాలలో పాదచారుల బాటపై శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణ పనులను కాంగ్రెస్ సినియర్ నాయకుడు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ కాలనీ వాసులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ విషయంలో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. అధిక సంఖ్యాకుల ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా ఒక వర్గానికో లేదా కొందరు వ్యక్తులకు లబ్ది చేకూరేలా అభివృద్ధి పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సనత్ నగర్ - ఎర్రగడ్డ రహదారిని 100 అడుగులకు విస్తరించాలని గతంలోనే దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం పనులు సవ్యంగా చేపట్టి ఇరువైపులా పాదచారుల బాటను, మధ్యలో ఎత్తైన డివైడర్ తో పాటు విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా సనత్ నగర్ లోని 56 పార్కులనుండి ఇద్దరేసి ప్రతినిధుల తో కలిసి చింతలబస్తీ లోని డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్ ను కలిసి సనత్ నగర్ నివాసితుల పక్షాన ఆవేదనను వెలిబుచ్చుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ జంటనగరాలలో అతి పురాతన కాలనీలలో ఒకటని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల తరబడి ఆస్తి పన్ను, ఇతర పన్నులు ఎంతో నిబద్ధతతో సకాలంలో చెల్లిస్తున్నారని అన్నారు. తమ కుటుంబానికి సనత్ నగర్ నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉందని ఆయన అన్నారు. తన తండ్రి గారైన డా మర్రి చెన్నా రెడ్డి సనత్ నగర్ శాసన సభ సభ్యునిగా ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తించారని, తాను కూడా ఈ నియోజవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించానని, పదవులతో నిమిత్తం లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్ధుడినై ఉంటానని పునరుద్ఘాటించారు .
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అయూబ్ ఖాన్, యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, ఉమ (హృషీకేశవ), ఆకూరి శ్రీనివాస్ రావు, పొలిమేర సంతోష్ కుమార్, వై శ్రీనివాస్ రావు, శక్తేశ్వర్, సి వి శ్రీనివాస్, కె సుధీర్ ముదిరాజ్, రమణ, పి నరేందర్, అజ్జూ, షాహబాజ్, అడ్డూ, రవికాంత్ గౌడ్, ఆర్ బి నరేష్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ వంశీ, కమల్ రాజ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ యాదవ్ షేక్ గౌస్, తదితరులు డిప్యూటీ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.