మహిళల ఆందోళనలను కవర్ చేసినందుకు ఆగ్రహం
ఇద్దరు జర్నలిస్టులను చావబాదిన రాక్షసమూక
నార్వే దౌత్య కార్యాలయంలో వైన్ సీసాలు పగులగొట్టి పుస్తకాలు దగ్ధం
కాబూల్,సెప్టెంబర్9(ఇయ్యాల తెలంగాణ): తాలిబన్ల దుశ్చర్యలు మెల్లగా బయటపడుతున్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయకముందే వారు తమ రాక్షస కృత్యాలను సాగిస్తున్నారు. తాజాగా ఇద్దరు జర్నలిస్టులను చితకబాదిన ఘటనతో ప్రపంచం చలించి పోయింది. హృదయవిదారకంగా వారిని గొడ్డును బాదినట్లు బాదిన చిత్రాలు చూసిన తర్వాత అఫ్ఘానిస్తాన్‌పై ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆందోళనకు మరింత బలం చేకూరుతోంది. అఫ్ఘాన్‌లో మానవహక్కులు, పత్రికా స్వేచ్ఛగా ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు మరిన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కరుడుగట్టిన ఇస్లామిక్ సంస్థగా పేరున్న తాలిబన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి గంటలు గడవకముందే అరాచకం ప్రారంభమైంది. పశ్చిమ కాబూల్‌లోని కార్ట్ ఏ చార్ ప్రాంతంలో బుధవారం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రిపోర్టర్ నేమత్ నఖ్దీ, వీడియో ఎడిటర్ తాకి దర్యాదీ అనే ఇద్దరు జర్నలిస్టులు కవర్ చేశారు. ఇది తాలిబన్‌ను ఆగ్రహానికి గురి చేసింది. అంతే, ఇద్దరు జర్నలిస్ట్‌లను పట్టుకుని కిరాతకంగా కొట్టారు. గాయాలు, రక్తపు ధారలతో ఇద్దరు జర్నలిస్టుల శరీరం నిండిపోయింది. సహాయంతో కూడా నవడలేని స్థితిలో ఉన్న ఆ జర్నలిస్ట్‌లను చూసి నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేశారు. కాబూల్‌లోని తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తిరిగి దానిని తమకు అందిస్తామన్నారని ఇరాన్లో నార్వే రాయబారి సిగ్వల్డ్ హాగ్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ఎంబసీలోని వైన్ సీసాలను, పిల్లల పుస్తకాలను వారు ధ్వంసం చేశారని తెలిపారు. ఇటీవల తాలిబన్లు మాట్లాడుతూ తాము విదేశీ దౌత్య కార్యాలయాలు సహా సంస్థల జోలికి పోబోమని తెలిపారు. అయితే, అంతలోనే నార్వే రాయబార కార్యాలయంపై పడడం వారి మాటలకు, చేతలకు మధ్య పొంతన ఉండడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, మొన్న తాలిబన్లు ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో అంతర్జాతీయ ఉగ్రవాది సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గతశాఖ మంత్రిగా ఉన్నారు. త్వరలోనే హిబతుల్లా అఖుంద్జాదా సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.