భవిష్యత్‌లో వరదలు వచ్చినా నష్టం రాకూడదు
అధికారులతో సవిూక్షించిన మంత్రి కెటిఆర్
రాజన్న సిరిసిల్ల,సెస్టెంబర్8(ఇయ్యాల తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సవిూక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చిన ఎలాంటి నష్టం కలగాకుండా చేపట్టాల్సిన అంశాలపై కేటీఆర్ అధికారులతో చర్చించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వర్షం నీరు ఎక్కడా నిలవకుండా ఉండేలా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లోగా జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన నివేదిక సమర్పించాలన్నారు.
పట్టణంలో వరదల సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సవిూక్ష సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తడిసి ముద్దయిన విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా 15 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. 30 ఏండ్ల తర్వాత అంతటి భారీ వాన కురిసినట్టు అధికారులు తెలిపారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం చెరువు మత్తడి దూకి నీరు సిరిసిల్ల మండలంలోని బోనాల గ్రామంలోని పెద్ద చెరువు, జంగమయ్యకుంట, శుద్ధగండి చెరువులోకి చేరింది. మూడు చెరువులు మత్తళ్లు దుంకడంతో నీరు సిరిసిల్లను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన వెంకంపేట, ప్రగతినగర్, శివనగర్, అశోక్‌నగర్, పాతబస్టాండ్, సంజీవయ్యగర్, నేతన్నచౌక్, మెయిన్ బజార్, శాంతినగర్ వార్డులు నీట మునిగాయి. నడుము లోతు నీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.దుకాణాలు, షాపింగ్‌మాల్స్, మెడికల్ హాళ్లలోకి నీరు చేరి బట్టలు, నిత్యావసరాలు తడిసి తీరని నష్టం వాటిల్లింది. సిరిసిల్లలోని బస్టాండ్, కలెక్టరేట్ వరద నీటితో చెరువులుగా మారాయి. కలెక్టరేట్ గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొనడంతో అధికారులంతా బయటే ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పాతబస్టాండ్ చెరువుగా మారడంతో బస్సులన్నీ తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద చౌరస్తాలో నిలిపివేశారు. వేములవాడ మూల వాగు ఉగ్రరూపం దాల్చడంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన శ్లాబ్ సెంట్రింగ్ కూలిపోయింది.