దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి
స్వర్ణభారతి ట్రస్ట్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్,సెప్టెంబర్7(ఇయ్యాల తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత టీకాకరణ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఉషమ్మ దంపతులు ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రోని హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ 3 కేంద్రాలలో ఏకకాలంలో ఈ టీకా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5,000 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కరోనాతో సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. దీన్ని ప్రజా ఉద్యమంలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయ వంతం చేయాలని సూచించారు. దేశంలో గత ఆగస్టు లో 50 శాతం టీకాలు పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని వివరించారు. అదే విధంగా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ప్రభుత్వాలు, నిపుణుల సూచనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు.
టీకాకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వర్ణభారత్ ట్రస్టు నిర్వహకులు, భారత్ బయోటిక్, ముప్పవరపు ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ , సింహపురి వైద్య సేవాసమితి, పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్స్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర, స్వర్ణ భారత్ ట్రస్టు చైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి హెల్త్‌సిటి చైర్మన్ భద్రారెడ్డి, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్ కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డి, వల్లభనేని వంశీ, నెల్లూరు కలెక్టర్ శ్రీ చక్రధర్‌బాబు, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టి ముప్పవరపు హర్షవర్ధన్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.