Ticker

6/recent/ticker-posts

Ad Code

కళ్యాణలక్ష్మితో బాల్యవివాహాలకు చెక్‌ - కెసిఆర్‌ నిర్ణయంతో గణనీయంగా తగ్గిన సంఖ్య

దేశానికి ఆదర్శంగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ పథకాలు



గిరిజన, స్త్రీ` శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌,సెస్టెంబర్‌8(ఇయ్యాల తెలంగాణ): బాల్య వివాహాలను బలవంతంగా ఆపితే ఆగవని గుర్తించిన సీఎం కేసిఆర్‌ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి, కచ్చితంగా 18 ఏళ్లు నిండిన వారికే పథకం వర్తింప జేయడంతో బాల్య వివాహాలు పూర్తిగా ఆగిపోయాయని  గిరిజన, స్త్రీ` శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. దీంతో చాలా వరకు బాల్య వివాహాలు తగ్గాయన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ పని చేస్తున్నట్లుగా దేశంలోనే మరెవరు చేయడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మహిళలు, శిశువుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణలో మనం అద్భుతంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన పోషకాహారం అందజేసి పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నివారించడం, వారి సమగ్ర ఎదుగుదల కోసం రూపొందించిన పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లాలోని గుమ్మనూరు రైతు వేదికలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు, శిశువుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణలో మనం అద్భుతంగా పని చేయగలుగుతున్నాం. ఇటీవలే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి గడువు ముగుస్తున్న పోషణ అభియాన్‌ కొనసాగించాలని కోరామన్నారు. వారు దానికి వెంటనే అంగీకరించారని మంత్రి తెలిపారు.


 గుజరాత్‌ రాష్ట్రంలోని కేవడియాలో అంగన్‌వాడీ సేవలను పటిష్టం చేసేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జాతీయ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. అక్కడ మన రాష్ట్రం తరపున శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌ వెళ్లి మన దగ్గర చేపడుతున్న పథకాల గురించి చెప్పినప్పుడు చాలా ప్రశంసలు లభించాయని గుర్తు చేశారు.

 కేంద్రం సహకరించకపోయినా అంగన్‌వాడీల సేవలు గుర్తించి తెలంగాణ వచ్చాక మూడుసార్లు వేతనాలు పెంచుకున్నాం. కేంద్రం 2700 రూపాయలు ఇస్తుంటే మనం 13,650 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో గిరి పోషణ ద్వారా ఆదిమ గిరిజనులకు ఎక్కువ పోషకాలు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.  మన మానుకోటలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చేసే కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసించే విధంగా మనం పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, సర్పంచ్‌లు ఎన్‌. పద్మ, బొడశ్రీను, భరత్‌, గుగులోతు పద్మ ఎంపీటీసీ నరేష్‌, టి.ఆర్‌.ఎస్‌ నేతలు నూకల రంగారెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, మన్యు, నాగన్న, కొప్పుల వెంకట్‌ రెడ్డి, సుందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు