Ticker

6/recent/ticker-posts

Ad Code

ఆలయ భూములకు హక్కుదారు దేవుడే

 గుడి దేవుడి సొత్తు.. దేవుడే యజమాని - లీగల్‌ హక్కుదారు


పూజారులకు ఆస్తిపై హక్కు లేదన్న సుప్రీం

దేవాలయ ఆస్తుల హక్కు కాలమ్‌లో దేవుడి పేరు 

మధ్యప్రదేశ్‌ కేసులో సుప్రీం సంచలన తీర్పు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(ఇయ్యాల తెలంగాణ):  ఆలయాలు, వాటి ఆస్తులకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడిరచింది. గుడి దేవుడి సొత్తు.. దానికి అనుబంధంగా ఉన్న భూములు, ఇతర ఆస్తులకు దేవుడే యజమాని. లీగల్‌ హక్కుదారు ఆ దేవుడు లేదా ఆ దేవతనే అవుతారని తాజా తీర్పులో  స్పష్టం చేసింది. ఆలయాలకు సంబంధించిన ఆస్తుల రెవెన్యూ రికార్డుల్లో పూజారి పేరుగానీ, కలెక్టర్‌ లేదా వాటి నిర్వహణ బాధ్యత చూసే మరే అధికారి పేరుగానీ ఉండకూడదని తీర్పు ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో యజమాని కాలమ్‌లో దేవుడు,దేవత పేరునే పెట్టాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం లా రెవెన్యూ కోడ్‌ 1959 కింద రెండు సర్క్యులర్‌లు జారీ చేసింది. ఆ సర్క్యులర్స్‌ ప్రకారం ఆలయాలు, వాటి ఆస్తులకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించాలని అధికారులను ఆదేశించింది. పూజారుల పేరు ఉండడంతో దేవాలయ ఆస్తులను వాళ్లు సొంత అవసరాల కోసం అమ్ముకుంటున్నారని, ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పూజారుల పేర్లను డిలీట్‌ చేయాలని పేర్కొంది. అయితే ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కొందరు పూజారులు మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.


 వారసత్వంగా తాము ఆలయాల నిర్వహణ చూస్తూ వస్తున్నామని, తమకు ఆలయ భూములపై యాజమాన్య హక్కు ఉందని వాదించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్క్యులర్లను కొట్టేసింది. దీనిని సవాలు చేస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం సోమవారం తీర్పు ఇచ్చింది. మధ్యప్రదేశ్‌ సర్కారు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. పూజారుల పేర్లు గానీ, మేనేజర్ల పేర్లు గానీ రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా ఉండాలని ఏ చట్టంలోనూ లేదని వ్యాఖ్యానించింది. దేవుడే ఆ గుడి, దాని ఆస్తులకు లీగల్‌ యజమాని అని పేర్కొంది. పూజారులకు ప్రత్యేకించి అటువంటి హక్కులేవీ లేవని స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు.. రామ జన్మభూమి కేసు తీర్పులో దేవుడే ఆ ప్రాపర్టీకి జ్యూరిస్టిక్‌ పర్సన్‌ అవుతాడని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసింది. రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరు స్థానంలో దేవుడి పేరును రాయాలని స్పష్టం చేసింది. అయితే పబ్లిక్‌ టెంపుల్స్‌కు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని, ప్రైవేట్‌ టెంపుల్స్‌కు వర్తించదని సుప్రీం ధర్మాసనం వెల్లడిరచింది. ఏదైనా ఇంట్లో లేదా పబ్లిక్‌ దర్శనాలకు అనుమతి ఇవ్వని ఆలయాలను పబ్లిక్‌ టెంపుల్స్‌గా చూడలేమని తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు