నవతరంగిణి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురువుల దినోత్సవము
హైదరాబాద్,సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : గురువులు తమ ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదిద్దుతూ తాము మాత్రం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ విద్యార్థుల ఉన్నత శిఖరాలతో సంతృప్తి చెందుతారని భారతీయ జనతా పార్టీ గోల్కొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.కుమార్ అన్నారు. గురువుల రోజును పురస్కరించుకొని నవతరంగిణి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.శాలిబండ లోని సుధా థియేటర్ సమీపంలోని భారత్ గుణవర్తిక సంస్థ గ్రంథాలయ భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు పాతనగర ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా స్థాయికి ఎదిగిన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న అధికారులను నవతరంగిణి ఆర్గనైజేషన్ సంస్థ తరపున సన్మానం చేశారు. విద్యా జ్యోతి - 2021 అవార్డు తో సత్కరించారు. ఈ సందర్బంగా పలువురు గురువులు ప్రసంగిస్తూ .. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపిస్తూ వారు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి గురువులు కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా శాలిబండ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎస్. అనిరుద రావు, జిల్లా సైన్సు అధికారి సి. ధర్మేందర్ రావు, సెయింట్ మారియా హై స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్. లలిత,దుర్గా ప్రసాద్ భన్వారీ లాల్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సరితా అగర్వాల్ లను ఎంపిక చేశారు.
ఓల్డ్ సిటీ ని గోల్డ్ సిటీ గా మారుస్తాం : ప్రేమ్ కుమార్
ఈ సందర్బంగా నవతరంగిణి ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎం. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పాతనగరంలో అన్ని రంగాల నుండి ఆణి ముత్యాలను వెలికి తీయడంలో పాతనగర ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఓల్డ్ సిటీ ని గోల్డ్ సిటీ గా మార్చడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవతరంగిణి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కె. నాగరాజ్,సభ్యులు బి.విజయ్ కుమార్, ఎం. మహేందర్, రఘు,చిట్టి,బాబురావు, రాజు, గణేష్,పద్మ తదితరులు పాల్గొన్నారు.