బెంగళూరులో యువకుడి దారుణం
బెంగళూరు,ఆగస్ట్31(ఇయ్యాల తెలంగాణ): ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్ల దాడి తప్పడం లేదు. అబలలు బలవుతూనే ఉన్నారు. తాజాగా పెళ్లికి నిరాకరించిందని ఓ యువకు డు నడిరోడ్డుపై యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేసాడు. ఈ ఘటన బెంగళూరు కెంగేరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పశ్చిమ డిసిపి సంజీవ్ పాటిల్ వివరాల మేరకు... దొడ్డబెలె రోడ్డు నివాసి అనిత (23) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. సహోద్యోగి వెంకటేశ్ మూడేళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. వెంకటేశ్‌తో పెళ్లికి అనిత కుటుంబీకులు అంగీకరించలేదు. అనిత కూడా తిరస్క రించడంతో వెంకటేశ్ పగ పెంచుకున్నాడు. సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలో రోడ్డుపై అనిత నడుచుకుంటూ ఆఫీసుకు వెళుతుండగా, వెంకటేశ్ అడ్డగించాడు. అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోశాడు. గమనించిన స్థానికులు తీవ్ర రక్తస్రావంతో ఉన్న అనితను వెంటనే బిజిఎస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. వెంకటేశ్ ఇటీవల మార్కెట్‌కు వెళ్లి రూ.80తో పదునైన కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని డిసిపి తెలిపారు. రాజరాజేశ్వరి ఆస్పత్రిలో అనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యలు కోరారు.