హైకోర్టు ఆదేశాలతో విద్యాసంస్థల నిర్ణయం మళ్లీ వెనక్కి
హైదరాబాద్,ఆగస్ట్31(ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్రంలోని విద్యా సంస్థలతోపాటు బుధవారం నుంచి వాటిలోని హాస్టళ్లు కూడా తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నీళ్లు జల్లింది. దీంతో విద్యాసంస్థలను మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే గురుకులాలతో పాటు విశ్వవిద్యాలయాల్లోని హాస్టళ్లను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గురుకులాల్లోనే కాకుండా వివిధ యూనివర్సిటీల పరిధిలో కూడా హాస్టళ్లు ఉన్న విషయం తెలిసిందే. విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో హాస్టళ్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు వైస్ చాన్సలర్లు సమావేశంలో ప్రస్తావించారు. దానికి స్పందనగా.. హాస్టళ్లను తెరుచుకోవచ్చని విద్యా శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. ఆయా యూనివర్సిటీల వెసులుబాటు మేరకు వాటిని ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చని ఆయన చెప్పారు. ఇంటర్ స్థాయి నుంచి ఎగువ తరగతుల విద్యా సంస్థల్లో కచ్చితంగా ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు మంత్రి, ఇతర అధికారులు స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. రెండు నుంచి ఐదు గదులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జ్వరం, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు కలిగిన విద్యార్థులను వీటిలోకి పంపించాలని తెలిపారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్నది సిఎం కెసిఆర్ సమక్షంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యక్ష బోధనకు ఇప్పుడే వద్దని, హాస్టళ్లను తెరవవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదుపరి చర్యలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. తక్కువ సమయం ఉండడంతో ఈసారి పాఠశాలల్లో విద్యా సంవత్సరాన్ని సుమారు 166 రోజులపాటు కొనసాగించాలని అధికారులు భావించారు.సాధారణంగా అయితే అకడమిక్ ఇయర్‌ను 240 రోజులపాటు నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది పాఠశాలల ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ మేరకు కొన్ని రోజులను కుదించారు. అలాగే.. దసరా వంటి పండుగ సెలవులను కుదించనున్నారు. ఇకపోతే సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలో స్వచ్ఛతా పక్షోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పక్షోత్సవాలకు సంబంధించి ఏయే రోజు ఏయే పనులు చేయాలనే విషయంలో డీఈవోలకు సూచనలు చేశారు. మొదటి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులతో స్వచ్ఛతా శపథం చేయాల్సి ఉంటుంది. రెండో రోజు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, చేతులు కడగడం, మాస్క్‌లను ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి. తరగతి గదులతో పాటు ఆవరణలను పరిశుభ్రంగా ఉంచడానికి వీలుగా పెయింటింగ్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించాలి. అయితే ఇవి కూడా వెనక్కి పోయినట్లే భావించాలి.