హైదరాబాద్,జూన్11(ఇయ్యాల తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని సంజయ్ విమర్శించారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదన్నారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డా.లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మోదీ ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికీ వెళ్ళి వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్భాటాలకు పోకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 10కోట్ల కుటుంబాలను.. తెలంగాణలో 30లక్షల కుటుంబాలను కలవాలని జాతీయ నాయకత్వం ఆదేశించిందని సంజయ్ తెలిపారు. మోదీ ఏడాది పాలనలో ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ లాంటి సాహసోపేతమైన చట్టాలను తీసుకొచ్చారని కొనియాడారు. మోదీ చొరవతోనే దేశంలో కరోనాను కట్టడి చేయ గలుగుతున్నామన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటున్నారని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కరోనా టెస్టులను చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంద న్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయక పోవటం బాధాకరమన్నారు. డాక్టర్లు, పోలీసులు, విూడియా ప్రతినిధులకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు.
పోతిరెడ్డి పాడుతో పాలమూరు ఎండుతుందన్న మాజీ ఎంపి జితేందర్ రెడ్డి
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజందరిలో మనో ధైర్యాన్ని నింపి వారిని ఏకతాటిపైకి తెచ్చి... కరోనాను అరికట్టడంలో దేశ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలే కారణమని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కేంద్రం పంపిన నిధులను మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేశారని...వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ నిధులుగా చెప్పుకున్నారని ఆరోపించారు. ఇది గ్రహించిన కేంద్రం నిరుపేదలకు, లబ్ది దారులకు నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేసిందని తెలిపారు. వలస కార్మికులను కేంద్రం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజల కోసం పని చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని జితేందర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. పోతిరెడ్డిపాడు పాడు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్టాండ్ మారదన్నారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఆపమని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కడితే నష్ట పోయేది పాలమూరు రంగారెడ్డి జిల్లాలని.. ఆ ప్రాజెక్టు చేపడితే హైదరాబాద్‌కు తాగు నీటి కొరత ఏర్పడుతుందన్నారు. ప్రాజెక్టు పేరు చెప్పి మంత్రి పదవులు అనుభవిస్తున్న నాయకుల వెంటనే పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసి నిరూపించాలి, లేదంటే ప్రజలు క్షమించరని జితేందర్‌రెడ్డి హెచ్చరించారు.