హైదరాబాద్,జూన్10(ఇయ్యాల తెలంగాణ ): జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో కేసు ఫైల్ చేశారు. జీవో 111 కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్జీటీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ సర్కార్ కు, పీ సీ బీ, హెచ్ ఎం డీ ఏ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఎన్జీటీ కేంద్ర పర్యావరణ ప్రాంతీయ అధికారి నేత్రుత్వంలో నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై మంత్రి కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఫామ్ హౌస్ తనది కాదని చెప్పి మంత్రి కేటీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్ట్, రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.