కరోనా టెస్టుల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం
ప్రభుత్వ పనితీరుపై కేంద్రానికి లేఖ రాస్తాం
హౌజ్ అరెస్ట్ పై మండిపడ్డ లక్ష్మణ్
హైదరాబాద్,జూన్12(ఇయ్యాల తెలంగాణ): సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని..మనం ప్రజా స్వామ్యంలోనే ఉన్నామా ? అని బిజెపి నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగడం పరిపాటిగా మారిందని విమర్వించారు. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా..? ఆర్టికల్ 370 లాంటిది తెలంగాణలో అమలు జరుగుతోందా..? అంటూ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని శుక్రవారం పోలీసు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను వివరించడానికి బీజేపీ నేతలు అపాయింట్ మెంట్ కోరారు. అయితే సీఎంను కలవడానికి అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో బీజేపీ నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కూడిన బృందం నేరుగా ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించి బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా ప్రగతి భవన్‌కు వెళ్లే అన్ని దారుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హౌస్ అరెస్ట్‌పై బీజేపీ నేత లక్ష్మణ్ విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన ఉందా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో జరగడం దారుణం. గాంధీలో కరోనా రోగులకు కనీస వసతులు కూడా లేవు. గాంధీ వెళ్లే కంటే స్మశానానికి వెళ్లడం మంచిదనే భావన కలుగుతోంది. చనిపోయిన శవాలను కూడా సరిగా ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.
డెత్ రేట్ దేశ సగటుకంటే తెలంగాణలో అధికంగా ఉంది. గచ్చిబౌలి టిమ్స్ ఏమైంది. ప్రస్తుతం అందులో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ చార్జీలను రద్దు చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశామని అన్నారు. ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించాలని లేఖలో కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫమైందని ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి బయలు దేరిన బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్ నిబంధనలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. కరోనా వైరస్‌కు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.