మధుసూధన్ రావు కేసులో హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్,జూన్,5 (ఇయ్యాల తెలంగాణ): నగరంలోని వనస్థలిపురానికి చెందిన అల్లం పల్లి మధుసూదన్ కరోనా వైరస్‌తో మృతిచెందాడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. అతని మరణ ధృవీకరణ పత్రం, చితాభస్మం తమ వద్ద ఉన్నాయని కోర్టుకు వివరించింది. కాగా తన భర్త మధుసూదన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత అతని ఆచూకీ తెలియలేదంటూ భార్య మాధవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ అతను కరోనాతో మృతిచెందితే కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వరా అని నిలదీసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం పూర్తి వివరాలను కోర్టుకు వివరించింది. కరోనా కారణంగానే మధుసూదన్ మృతి చెందాడని పేర్కొంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అతని మరణ ధృవీకరణ పత్రంతో పాటు చితాభస్మం అతని భార్య మాధవికి అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ వి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 9 కి వాయిదా వేసింది.