హర్యానాలో విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు
షిప్టు పద్దతిలో స్కూళ్లు నడిపిస్తామంటున్న ప్రభుత్వం
చంఢీగడ్,జూన్4 (ఇయ్యాల తెలంగాణ): హర్యానా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దశల వారీగా విద్యాసంస్థలను తెరిచేందుకు తాము ఒక ప్రణాళికను రూపొందించామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. ముందుగా 10, 11, 12వ తరగతి విద్యార్థుల కోసం స్కూళ్లు ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశవారీగా 6 నుంచి 9, 1 నుంచి 5 తరగతులను తెరుస్తామన్నారు. అయితే 50 శాతం సామర్థ్యంతోనే పాఠశాలు నడిపేందుకు అనుమతిస్తామన్నారు. అంటే ఒక తరగతిలో 30 మంది ఉంటే.. 15 మందికి ఒకపూట, మిగతా 15 మందికి మరోపూట లేదా మరో రోజు తరగతులు నిర్వహించేలా పాఠశాలలను ఆదేశిస్తామని మంత్రి వెల్లడించారు. ఇక డిగ్రీ కాలేజీలను కూడా ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని హర్యానా విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఆగస్టులో ఫస్టియర్ తరగతులు ప్రారంభమవుతాయని, సెకండియర్ తరగతులను సెప్టెంబర్లో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. విద్యాసంస్థల పునఃప్రారంభానికి అవసరమైన మరిన్ని నిర్ణయాలను యూనివర్సిటీలు తీసుకుంటాయని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా వాయిదాపడ్డ 12వ తరగతి ఫైనల్ పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నామని, పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.