నిరాడంబరంగా రంజాన్ పర్వదినం
రంజాన్ వేళ బోసి పోయి ఉన్న చార్మినార్ పరిసర ప్రాంతాలు
రంజాన్ వేళ బోసి పోయి ఉన్న చార్మినార్ పరిసర ప్రాంతాలు
ప్రశాంతంగా ప్రఖ్యాత చార్మినార్ ప్రాంతం - ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు
హైదరాబాద్,మే25(ఇయ్యాల తెలంగాణ ): దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముస్లిం సోదరులు ఇళ్లకే పరిమితం కావడం ఇదే ప్రథమం. కరోనా వలన లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండటంతో ముస్లిములు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండగ జరుపుకోవాల్సి వచ్చింది. నెల రోజుల ఉపవాస దీక్షను ఆదివారం సాయంత్రం విరమించారు. సోమవారం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకున్నారు. కానీ కరోనా వల్ల ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మక్కా మసీదు పండగ పూట నిర్మానుషంగా మారింది. సాధారణంగా రంజాన్ అంటే షీర్ ఖుర్మా చాలా ప్రత్యేకమైంది. ఈద్ ముభారక్ అంటూ ఇచ్చుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లోని మక్కా మసీదు వద్ద ముస్లీంసోదరులు ప్రార్ధనలు చేస్తూంటే చాలా బాగుంటుంది. కానీ, లాక్ డౌన్ వలన సామూహిక ప్రార్ధనలు, ఖీర్,హలీమ్‌లు బంద్ అయ్యాయి. ఈద్ రోజున ముస్లింలతో నిండిపోయే చార్మినార్ పరిసర ప్రాంతాలు సోమవారం నిర్మానుషంగా కనిపించాయి. నగరంలో ఎటువంటి ప్రార్థనలకు అనుమతి లేకపోవడం వల్ల.. ఈద్ పండుగ రోజున కూడా ముస్లిములు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్పందించారు. చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ఎటువంటి సామూహిక ప్రార్థనలు జరగలేదు. ఆ ప్రాంతం అంతా కళ తప్పినట్లుగా మారింది. లాక్డౌన్ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని మసీదులను మూసివేశారు. నగరంలో ఉన్న మేటి మసీదు.. ఈద్గా విూర్ ఆలమ్, ఈద్గా బిలాయి, ఈద్గా మాదన్నపేటతో పాటు ఇతర పెద్ద మసీదుల్లోనూ ఈద్ ప్రార్థనలను నిర్వహించలేదు. ఎటువంటి సామూహిక ప్రార్థనలు నిర్వహించరాదు అంటూ ప్రతి మసీదు ముందు బ్యానర్లను పెట్టారు. జామియా నిజామి చేసిన అభ్యర్థన పోస్టర్‌ను కూడా మసీదుల ముందు ఉంచారు. మొఘల్‌పురాలో ఉన్న ప్రఖ్యాత జామా మసీద్ హఫీజ్ దనాఖాను కూడా మూసివేశారు.నగరంలోని ముస్లిములు అందరూ ఇండ్లల్లోనూ ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఫ్యామిలీ సభ్యులతోనే పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్లిములు ఇండ్ల వద్దనే శుభాకాంక్షలు తెలు పుకున్నారు. సిటీలోని అనేక బస్తీలు కూడా కళతప్పాయి. మసీదులు అన్నీ మూసివేయడంతో ప్రార్థనల సమయాన్ని కూడా ఎక్కడా వెల్లడించలేదు. ఆదివారం రాత్రి చార్మినార్ వద్ద రంజాన్ బజార్‌ను మూసివేశారు. రాత్రి 7 గంటకే షాపులను మూసివేసి.. ఆ ప్రాంతంలో కర్ఫ్యూను విధించారు. చార్మినార్, లాడ్ బజార్, పత్తేర్ఘాట్.. వీధులన్నీ జనంలేకుండా వెల వెల బోయాయి.