న్యూఢిల్లీ,మే30(ఇయ్యాల తెలంగాణ): దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పంజా విసురుతోంది. రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండవ రోజు కూడా పాజిటివ్ కేసులు ఏడు వేలు దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణించిన వారి సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 265గా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకే రోజు అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే అత్యధికం. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763గా ఉన్నది. సుమారు 80 వేల మంది వైరస్ నుంచి కోలు కున్నారు. ఇకపోతే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 114 మంది పోలీసులు కరోనా పాజిటివ్ లు గా తేలారు. ఈ వైరస్ ప్రభావంతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 2325కి చేరగా, మృతుల సంఖ్య 26కి పెరిగింది. శుక్రవారం రోజున మొత్తం 116 మంది పోలీసులు కరోనా బారిన పడగా, ముగ్గురు మరణించారు. ఇలా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పోలీస్ శాఖలో కరోనా కేసుల సంఖ్య అధికమవుతూనే ఉన్నది. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 2098 మంది మరణించారు. రాష్ట్రంలో మరో 33,133 పాజిటివ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 26,997 మంది బాధితు కోలుకుని దవాఖాన నుంచి డిశ్చార్చి అయ్యారు.