వ్యవసాయ రంగంలో ARTIFICIAL INTELLIGENCE

ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిది. ఇంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్‌ వచ్చినప్పుడు యంత్రాలు సాగుచేస్తాయా అన్నవాళ్లున్నారు. తర్వాత ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో రైతులు ఈ పద్ధతులకూ అలవాటు పడ్డారు.ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం రంగం పుంజుకున్నది. కానీ తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్న కాలం వచ్చేసింది. ఇలాంటి సమయంలో కృత్రిమ మేధ సాంకేతికత (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) తెరపైకి వచ్చింది. జనరేటివ్‌ ఏఐ ద్వారా

వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్‌ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే అతితక్కువ కలుపు నాశనిలతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదు. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణిస్తూ చేసే ప్రెసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి.వ్యవసాయ రంగంపైనా ఇది ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే వ్యవసాయరంగంలో కొన్ని కృత్రిమ మేధ సాంకేతికత ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల రైతులకు ఏం మేలు
జరగనుంది? వ్యవసాయ రంగానికి అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది.మనదేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతం పైనే ఆధారపడి ఉన్నది. కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్‌ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని విస్తృత పరచి రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలని తలచి వ్యవసాయ రంగానికి అనేక పథకాలు పెట్టి తద్వారా లాభాలు చేకూరుస్తున్నప్పటికీ నేటి పరిస్థితుల్లో వ్యవసాయం అంత లాభసాటిగా ఉండడం లేదు. దీనివల్లనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం

మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్‌ జీపీటీ’ ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి.మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్‌ ఓపెన్‌ ఏఐ సర్వీస్‌ ద్వారా చాట్‌ జీపీటీ ఆధారంగా తయారైన‘ జుగల్‌ బందీ‘ చాట్‌ బొట్‌ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్‌ వేర్‌. వాట్సాప్‌ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్‌ బోట్‌ ఇంగ్లీషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ రైతులకు అందిస్తుండటం విశేషం. చాట్‌ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడం కోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు.వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేసిన పంట ఎంత బాగా పండుతుంది అని కచ్చితంగా చెప్పగలదు. దీన్నే అంచనా విశ్లేషణ (ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌) అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి.

పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.నిప్పు … విద్యుత్తు… ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమమేధ కూడా అంతటి ప్రాముఖ్యత కలిగినదని అంటారు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌. మనిషీ, యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పని చేసే రోజులు వచ్చేశాయంటారాయన. కృత్రిమమేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు… మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో… సృజనాత్మకత, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే, ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్న మాట! ఏదేమైనా, ఈ కృత్రిమ మేధ సాంకేతికత (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పద్దతి ద్వారా అయినా మన దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు వ్యవసాయం లాభసాటిగా జరగాలని, వ్యవసాయంలో నష్టం వచ్చిందనే కారణంతో రైతులు వేలాదిగా ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆశిద్దాం. రైతు కుటుంబాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....